చేవెళ్ళ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి బీజేపిలో ఇమడలేకపోతున్నారా? అంటే అవుననే అనుకోవాలి ఆయన చెప్పిన ఫుట్‌బాల్ స్టోరీ విన్నట్లయితే. మంగళవారం ఆయన ఫుట్‌బాల్ తీసుకువచ్చి పార్టీ కార్యాలయంలో పార్టీ కార్యదర్శి చంద్రశేఖర్ తివారీ చేతిలో పెట్టారు.
"నేను ఏదైనా విషయం మాట్లాడేందుకు మిమ్మల్ని కలిస్తే వెళ్ళి పార్టీ అధ్యక్షుడు రామచందర్ రావుని కలవమంటారు. వెళ్ళి ఆయనని కలిస్తే మిమ్మల్ని కలవమంటారు. మీరిద్దరూ కలిసి నన్ను ఫుట్‌బాల్‌లా ఆడుకుంటున్నారు... అని తెలియజేయడానికే ఇది మీకు ఇస్తున్నాను,” అని కొండా విశ్వేశ్వర్ రెడ్డి చెప్పారు.
కానీ 24 గంటల్లో ఏం జరిగిందో కానీ ఆయన మాట మార్చి కొత్త స్టోరీ చెప్పారు. “రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీతో ఎలా ఫుట్‌బాల్ అడుకోవాలో పార్టీ నేతలకు చెప్పేందుకే నిన్న సింబాలిక్‌గా ఫుట్‌బాల్ తెచ్చి ఇచ్చానని, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని గద్దె దించి బీజేపి అధికారంలోకి వస్తే తప్ప తనకు తృప్తి ఉండదని," కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు.
ఒక్కరోజులోనే కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఫుట్‌బాల్ ఈవిదంగా మార్చడంతో ఆయన ఎవరినో గోల్ చేయబోయి సెల్ఫ్ గోల్ చేసుకున్నారా? అని సందేహం కలుగుతుంది.