తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి, మంత్రులు బీహార్ పర్యటన ముగించుకు రాగానే ఈ నెల 29న మంత్రివర్గ సమావేశం జరుగబోతోంది. దానిలో స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీ రిజర్వేషన్స్ అమలు చేయడంపై చర్చించనున్నారు.
అలాగే కాళేశ్వరం కమీషన్ నివేదికని శాసనసభ సభలో ప్రవేశపెట్టేందుకు ఆమోదం తెలుపనున్నారు. ఈ సమావేశంలో తెలంగాణ అసెంబ్లీ సమావేశాల తేదీ కూడా ఖరారు చేయనున్నారు. తాజా సమాచారం ప్రకారం ఆగస్ట్ 30 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగవచ్చు.
ఈ సమావేశాలలో స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీ రిజర్వేషన్స్, ముఖ్యంగా కాళేశ్వరం కమిషన్ నివేదిక ప్రధాన అజెండాగా మారబోతోంది. బీసీ రిజర్వేషన్స్ విషయంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలను మభ్యపెడుతోందని బీఆర్ఎస్ పార్టీ వాదిస్తోంది. కనుక దానికి ఈ అసెంబ్లీ సమావేశాలలోనే కాంగ్రెస్ పార్టీ తరపున 42 శాతం సీట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటన చేయడం ద్వారా గట్టిగా జవాబు ఇచ్చే అవకాశం ఉంది.
కాళేశ్వరం కమీషన్ నివేదిపై అసెంబ్లీలో జరుగబోయే చర్చలో కాంగ్రెస్ పార్టీ ఆ నివేదికలో అంశాలను పేర్కొంటూ బీఆర్ఎస్ పార్టీని దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేయవచ్చు. తద్వారా స్థానిక సంస్థల ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీపై కాంగ్రెస్ పార్టీ పైచేయి సాధించే అవకాశాలు పెరుగుతాయి.
ఈ విషయం బీఆర్ఎస్ పార్టీకి కూడా తెలుసు. కనుక కాంగ్రెస్ పార్టీని ధీటుగా ఎదుర్కొనేందుకు గట్టిగా ప్రయత్నించడం ఖాయం. దీని కోసం అది ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలంటూ సుప్రీంకోర్టు ఆదేశాలను ప్రస్తావిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయడం ఖాయమే. కనుక ఈసారి కూడా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు చాలా వాడివేడిగా జరుగబోతున్నాయి.