ఫామ్‌హౌసులో ముఖ్య నేతలతో కేసీఆర్‌ సమావేశం... అందుకేనా?

August 23, 2025


img

బీఆర్ఎస్‌ పార్టీ అధినేత కేసీఆర్‌ శుక్రవారం తన ఫామ్‌హౌసులో పార్టీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. కాళేశ్వరం కమీషన్ రద్దు చేసి, తమపై ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఆదేశించాలని కోరుతూ కేసీఆర్‌, హరీష్ రావులు హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు వేశారు. వాటిపై విచారణ జరిపిన హైకోర్టు ఈ కేసు తదుపరి విచారణ 5 వారాలకు వాయిదా వేసింది. ప్రభుత్వం త్వరలో శాసనసభ సమావేశాలు నిర్వహించి కమీషన్ నివేదికపై చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటుందని అడ్వకేట్ జనరల్ హైకోర్టుకి తెలిపారు. కనుక అంతవరకు వారిపై ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోకుండా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాల్సిన అవసరం లేదని హైకోర్టు స్పష్టం చేసింది. 

ఈ నేపధ్యంలో కేసీఆర్‌ బీఆర్ఎస్‌ ముఖ్య నేతలతో సమావేశమై తదుపరి కార్యాచరణ గురించి చర్చించారు. ఈ సమావేశంలో హరీష్ రావు, వినోద్ కుమార్, ప్రశాంత్ రెడ్డి, దామోదర్ రావు తదితరులు పాల్గొన్నారు. 

ముందుగా శాసనసభలో దీనిపై కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ఏవిదంగా ఎదుర్కోవాలో చర్చించారు. శాసనసభ సమావేశంలో జరిగే పరిణామాలను బట్టి మళ్ళీ న్యాయస్థానాన్ని ఆశ్రయించడం అవసరమా కాదా? అని నిర్ణయించుకుందామని అనుకున్నట్లు తెలుస్తోంది.


Related Post