తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు మరో మూడు దేశాలకు జాగృతిని విస్తరించారు. దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నార్వే దేశాలకు నూతన కార్యవర్గాలు ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు మొత్తం 14 దేశాలలో తెలంగాణ జాగృతి ఉంది.
ఇప్పుడు మరో మూడు దేశాలకు విస్తరించింది. ఈ మూడు దేశాలలో కార్యవర్గాల నియామకాలు తక్షణం అమలులోకి వస్తాయని కల్వకుంట్ల కవిత తెలిపారు. కనుక వారు తెలంగాణ జాగృతిని బలోపేతం చేసేందుకు, దాని ఆశయ సాధనకు గట్టిగా కృషి చేయాలని సూచించారు.
కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ పార్టీకి తండ్రి కేసీఆర్‌కు దూరం అయిన తర్వాత ఆమె తెలంగాణ జాగృతి కండువా వేసుకొని తిరుగుతున్నప్పటికీ రాష్ట్రంలో ఆమెను పట్టించుకునేవారే లేరు. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ నేతలు, కార్యకర్తలు అందరూ ఆమెకు, జాగృతికి దూరంగా ఉంటున్నారు.
ఆమె రాజకీయ భవిష్యత్తు అగమ్యగోచరంగా సాగుతోంది. కనుక తెలంగాణ జాగృతిని ఆమె రాజకీయ వేదికగా ఉపయోగించుకుంటూ ముందుకు సాగుతున్నారు.
ఒకవేళ కేసీఆర్ మళ్ళీ ఆమెను పార్టీలోకి ఆహ్వానిస్తే, దానిలో ఆమెకు సముచిత ప్రాధాన్యం ఇస్తేనే ఆమెకు మళ్ళీ పూర్వ వైభవం లభిస్తుంది లేకుంటే వేరే ఏదో ఓ పార్టీలో చేరి ముందుకు సాగక తప్పదు.
కనుక ఇంట్లో గెలవలేనప్పుడు దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నార్వే దేశాలకు తెలంగాణ జాగృతికి కార్యవర్గాలు ఏర్పాటు చేసి ఏం సాధించగలరు?అంటే సమాధానం చెప్పడం కష్టమే!