నేడు స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలను ఉద్దేశ్యించి చేసిన ప్రసంగాలలో బనకచర్ల ప్రాజెక్టుపై తగ్గేదేలేదని తేల్చి చెప్పారు.
ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు ఏమన్నారంటే, “తెలంగాణలో వరదలు వస్తే ఆ నీటిని దిగువనున్న ఏపీకి విడిచి పెడుతుంటారు. ఆ వరద కష్ట నష్టాలను మేమే భరించాల్సి వస్తోంది. కానీ ఆ వరద నీటిని మేము రాయలసీమకు తరలించి వాడుకుంటామంటే ఎందుకు అభ్యంతరం చెపుతున్నారు? వరదల వలన ఏపీ నష్టపోతూనే ఉంది. మేము ఆ నష్టం భరిస్తున్నప్పుడు ఆ వరద నీటిని వాడుకునే హక్కు కూడా మాకుంటుంది. సముద్రంలో వృధాగా కలుస్తున్న వరద నీటిని మేము వాడుకుంటే తెలంగాణకు నష్టం ఏమిటి? అభ్యంతరం దేనికి?” అని ప్రశ్నించారు.
తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి గోల్కొండ కోట వద్ద జరిగిన స్వాతంత్ర్య దినోత్సవంలో ప్రసంగిస్తూ, “కృష్ణా, గోదావరి నీళ్ళ విషయంలో ఎవరితోనూ రాజీపడే ప్రసక్తే లేదు. ముందుగా తెలంగాణలో రైతులకు నీళ్ళు ఇచ్చిన తర్వాతే ఎవరికైనా నీళ్ళు ఇస్తాం. ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్న బనకచర్ల ప్రాజెక్టు వలన తెలంగాణకు నష్టం జరుగుతుంది. కనుక దానిని తప్పకుండా అడ్డుకుంటాం,” అని అన్నారు.