సినిమాలపై బ్రతుకుతూ... వాటిని చంపేస్తారెందుకు? కృష్ణ వంశీ

August 14, 2025


img

ప్రముఖ దర్శకుడు కృష్ణ వంశీ తాజా ఇంటర్వ్యూలో సినిమా రివ్యూలు వ్రాసేవారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమా రిలీజ్ అవగానే దానిని పూర్తిగా చూడకుండానే థియేటర్లలో నుంచి ‘మినిట్ బై మినిట్’ అంటూ సొంత అభిప్రాయాలు చెపుతున్నారు. 

ఈవిదంగా చేస్తూ సినిమాని పురిట్లోనే చంపేస్తున్నారు. మళ్ళీ ఆ సినిమాలే మీరందరికీ బ్రతుకు తెరువు. అవి లేకపోతే మీకు బ్రతుకు తెరువే ఉండదు. ఓ వారం రోజులు ప్రేక్షకులను సినిమా చూడనిస్తే సినిమా బాగుందో లేదో వారే నిర్ణయించుకుంటారు కదా? మద్యలో మీకెందుకు తొందర?

ఇప్పటికే సినీ పరిశ్రమ అనేక సమస్యలతో సతమతమవుతోంది. ఈ రివ్యూలతో కూడా సినిమాలను ఎందుకు చంపేస్తున్నారు? సినిమాలపై మీకు అంత గొప్ప అవగాహన ఉంటే మీరే మంచి సినిమాలు తీయవచ్చు కదా?

కానీ మీకు ఆ శక్తి లేనప్పుడు రివ్యూలతో సినిమాలను ఎందుకు చంపేస్తున్నారు?మీ రివ్యూలతో ఓ సినిమా ఫ్లాప్ అయితే దాని వలన మీకు ఏం లాభం? సంతోషం కలుగుతుందా?” అని ప్రశ్నించారు. 

దర్శకుడు కృష్ణ వంశీ చెప్పినట్లుగా ప్రస్తుతం సినీ పరిశ్రమలో సమస్యల వలన పది రోజులుగా షూటింగ్‌లు నిలిచిపోయాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు సినిమాల విడుదలపై రాజకీయ పార్టీలు, ముఖ్యంగా అధికార పార్టీల ప్రభావం విపరీతంగా ఉంటోంది. 

కోట్లు ఖర్చు చేసి తీస్తున్న సినిమాలని పైరసీ దెబ్బకి నష్టపోతూనే ఉన్నాయి. ఇక ఓటీటీలు సినీ పరిశ్రమలు వరమో, శాపమో తెలీని పరిస్థితి.

ఇంకా పైకి కనపడని, ఎవరికీ తెలియని అనేక సమస్యలతో సినీ పరిశ్రమ సతమతమవుతూనే ఏటికి ఎదురీదుతోంది. ఇవన్నీ సరిపోవన్నట్లు సినిమా రివ్యూలతో జరుగుతున్నా నష్టం అంతా ఇంతా కాదు. దర్శకుడు కృష్ణ వంశీ చెప్పినట్లుగా సినిమా బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తారు లేకుంటే లేదు. మద్యలో రివ్యూల పేరుతో ఇలాంటి మేధావుల అభిప్రాయాలు అవసరమా? 


Related Post