సినీ కార్మికులకు ఏపీ, తెలంగాణ మంత్రులు హితవు

August 12, 2025


img

టాలీవుడ్‌ గత వారం రోజులుగా సినీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. దీనిపై ఏపీ, తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రులు కందుల దుర్గేష్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పందించారు. 

సినీ కార్మికులు మొండిగా సమ్మె కొనసాగిస్తే అందరూ నష్టపోతారని కనుక తక్షణం సమ్మె విరమించి షూటింగ్‌లకు హాజరు కావాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హితవు పలికారు.

షూటింగ్‌లలో పాల్గొంటూ జీతాల పెంపు సమస్యని నిర్మాతలతో మాట్లాడుకొని సామరస్యంగా పరిష్కరించుకోవాలని హితవు పలికారు. అవసరమైతే ప్రభుత్వం తప్పకుండా జోక్యం చేసుకొని ఇరువర్గాలతో మాట్లాడుతుందని చెప్పారు. 

ఏపీ మంత్రి కందుల దుర్గేష్ స్పందిస్తూ నిర్మాతలు, సినీ కార్మికులు పంతాలకు పోకుండా ఈ సమస్యని సామరస్యంగా చర్చించుకొని పరిష్కరించుకోవాలని హితవు పలికారు.

ఈ విషయం సిఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సిఎం పవన్‌ కళ్యాణ్‌ దృష్టికి తీసుకువెళ్ళి సమస్య పరిష్కారం కోసం ప్రయత్నిస్తానని చెప్పారు.     

సినీ కార్మికులు కోరినట్లుగా నిర్మాతలు 30 శాతం జీతాల పెంపుకి అంగీకరించారు. కానీ కార్మికుల రోజువారి చెల్లిస్తున్న జీతాలను బట్టి కొందరికి ఈ ఏడాది నుంచే 15, 20 శాతం చెల్లిస్తామని, వచ్చే ఏడాది నుంచి 5 శాతం చొప్పున పెంచుతామని చెప్పారు.

రోజుకి రూ.4,000 అంతకంటే ఎక్కువ జీతం పొందుతున్నవారికి జీతాలు పెంచలేమని స్పష్టం చేశారు. ఈ షరతులనే సినీ కార్మికులు వ్యతిరేకిస్తూ సమ్మె చేస్తున్నారు.

కొందరికి 15, మరికొందరికి 20 శాతం కాకుండా అందరికీ 30 శాతం పెంచాలని కోరుతున్నారు. రోజుకి రూ.4,000 అంతకంటే ఎక్కువ జీతం పొందుతున్నవారికి జీతాలు పెంచాలని కోరుతున్నారు. కానీ దీనికి నిర్మాతలు అంగీకరించకపోవడంతో సమ్మె కొనసాగుతోంది. 


Related Post