మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలంగాణ ప్రజలు, కాంగ్రెస్ అధిష్టానం ఆలోచించాల్సిన ఓ విషయం వెలుగులోకి తెచ్చారు.
బీహార్‌లో సుమారు గత రెండేళ్ళుగా 65 శాతం రిజర్వేషన్స్ అమలవుతున్నాయంటూ మాజీ కేంద్ర మంత్రి జైరామ్ రమేష్ నేడు ట్వీట్ చేశారు. దానిని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రీ ట్వీట్ చేస్తూ అందరి దృష్టికి తీసుకువచ్చారు.
ఇంతకీ జైరామ్ రమేష్ ఏం చెప్పారంటే, “బీహార్ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలు, ఈబీసీలు (ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు)కు కలిపి 65 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లును 2023 నవంబర్ 9న బీహార్ అసెంబ్లీ ఆమోదించింది.
ఆ మర్నాడు అంటే నవంబర్ 10, 2023న ఆ బిల్లుకి బీహార్ శాసన మండలి ఆమోదం తెలిపింది. దానికి గవర్నర్ వారం రోజులలోనే ఆమోదముద్ర వేశారు. కనుక బీహార్‌లో నవంబర్ 21, 2023న ఆ బిల్లు చట్టంగా మారింది. అప్పటి నుంచే బీహార్‌లో 65 శాతం రిజర్వేషన్లు అమలులో ఉన్నాయి.
తెలంగాణ ప్రభుత్వం కూడా రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కలిపి 67 శాతం రిజర్వేషన్లు, వాటిలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్స్ పెంచేందుకు అసెంబ్లీలో 2025, మార్చి 17న బిల్లు ప్రవేశపెట్టి అందించింది. మార్చి 18న దానిని శాసన మండలి ఆమోదించింది. మార్చి 30న ఆ బిల్లును గవర్నర్ ఆమోదం కొరకు పంపితే, ఆయన దానిని రాష్ట్రపతి పరిశీలన, అనుమతి కోసం పంపారు. నేటికి నాలుగు నెలలు దాటినా ఇంతవరకు రాష్ట్రపతి దానికి ఆమోదం తెలుపలేదు.
బీహార్‌లో నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ, ఆర్జేడీ, ఐఎన్సీ కూటమి ప్రభుత్వం కొనసాగుతున్నప్పుడు ఈ బిల్లుని గవర్నర్ ఆమోదించారు. బీహార్‌లోని సామాజిక వాస్తవాల దృష్ట్యా ఆ బిల్లుకి గవర్నర్ ఆమోదం తెలుపక తప్పలేదు. అప్పుడు గవర్నర్ ఆ బిల్లుని తొక్కి పట్టి ఉంచడానికి లేదా అడ్డుకోవడానికి బీజేపీకి అవకాశమే లేదు. గవర్నర్ ఆ బిల్లును రాష్ట్రపతి ఆమోదం కోసం పంపకపోవడం గమనార్హం.
కానీ తెలంగాణలో మాత్రం బీసీలకు 42 శాతం రిజర్వేషన్స్ కల్పించే ఈ బిల్లుకి బీజేపీ అడ్డంకులు సృష్టిస్తోంది. సామాజిక న్యాయం పట్ల బీజేపికి చిత్తశుద్ధి లేదనే విషయం బహిర్గతమవుతోంది. లేకుంటే ఈ బిల్లు రాష్ట్రపతి చేతికి వచ్చి నాలుగు నెలలైనా ఇంతవరకు ఆమోదించకుండా ఎందుకు పక్కన పెట్టేశారు?” అని జైరామ్ రమేష్ ట్వీట్ చేశారు.
నిజమే కదా? కేంద్రం, రాష్ట్రపతి అనుమతి, ఆమోదం లేకుండానే బీహార్‌లో 65 శాతం రిజర్వేషన్లు అమలుచేయగలుగుతున్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్స్ ఎందుకు అమలు చేయకూడదు?