కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలపై మూడు నెలల్లోగా చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌కు ఇటీవల ఆదేశించింది.
అనేక సమస్యలతో సతమతమవుతున్న బీఆర్ఎస్ పార్టీకి సుప్రీం ఆదేశాలు చాలా ఉపశమనం కలిగిస్తాయని వేరే చెప్పక్కరలేదు.
ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని సుప్రీం కోర్టు ఆదేశించినందున పార్టీ ఫిరాయించిన ఆరుగురు ఎమ్మెల్సీలపై కూడా వేటు వేయించేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సిద్దమయ్యారు.
ఈ మేరకు సుప్రీం కోర్టులో పిటిషన్ వేసేందుకు పార్టీ లీగల్ సెల్ సభ్యులను వెంటబెట్టుకొని శుక్రవారం ఢిల్లీకి వెళ్లారు. ఒకవేళ సుప్రీం కోర్టు ఈ పిటిషన్‌పై కూడా సానుకూలంగా స్పందించినట్లైతే అది బీఆర్ఎస్ పార్టీకి తప్పకుండా బూస్టింగ్ అవుతుంది.
ఈ రోజు రాఖీ పండుగ. కానీ కేటీఆర్, కల్వకుంట్ల కవితల మద్య దూరం పెరిగినందున ఆమె ఈసారి రాఖీ కట్టేందుకు రాకపోవచ్చు. అయినప్పటికీ మీడియా ఈ విషయం ప్రస్తావిస్తూ ఏవో కధనాలు వండి వడ్డించక మానదు.
ఇదంతా కేటీఆర్‌కి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కనుక రాఖీ పండుగకు ఒకరోజు ముందే ఈ వంకతో కేటీఆర్ ఢిల్లీ వెళ్ళిపోయి ఈ ఇబ్బందికర సమస్య నుంచి కూడా తెలివిగా తప్పించుకున్నారని చెప్పవచ్చు.