తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి మాజీ సిఎం కేసీఆర్‌ని ఉద్దేశ్యించిన సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, “కేసీఆర్‌కి ఓటమిని మించి మరో శిక్ష లేదు. చర్లపల్లి జైలుకి, ఫామ్‌హౌసుకి తేడా లేదు. ఏడాదిన్నరగా అయన స్వీయ నిర్భందం విధించుకొని ఫామ్‌హౌసులోనే ఉంటున్నారు.
చర్లపల్లి జైలు లోపల బయట పోలీసులు ఉంటారు. కేసీఆర్ ఫామ్‌హౌసు చుట్టూ కూడా ఉన్నారు. జైలులో ఖైదీలని కలిసేందుకు సందర్శకులు వస్తుంటారు. ఫామ్‌హౌసులో కేసీఆర్‌ని కలిసేందుకు వస్తున్నారు. కనుక చర్లపల్లి జైలుకి ఫామ్‌హౌసుకి తేడా ఏముంది?
ఆయన తనను తానే బందించుకొని శిక్ష అనుభవిస్తున్నారు. చివరిసారిగా అయనకి తుంటి ఎముక విరిగినప్పుడు హాస్పటల్‌కి వెళ్ళి పరామర్శించాను. అయనని మళ్ళీ కలవలేదు. కనుక ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో నాకు తెలీదు.
ఆయనని మేము మా రాజకీయ ప్రత్యర్ధిగా మాత్రమే చూస్తున్నాము తప్ప శత్రువుగా కాదు. దివంగత ప్రధానులు వాజ్‌పేయి, పీవీ నరసింహారావు కూడా తమ రాజకీయ ప్రత్యర్ధులకు అత్యవసరమైనప్పుడు సహాయపడేవారు. మా ప్రభుత్వం కూడా అవసరమైతే కేసీఆర్‌కి వైద్య సాయం అందిస్తుంది,” అని అన్నారు.