తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు అమెరికా నుంచి తిరిగివచ్చిన తర్వాత సొంత పార్టీ, నేతలు, తండ్రి కేసీఆర్‌లపై విమర్శలు చేసినప్పటి నుంచి బీఆర్ఎస్ పార్టీ నేతలు ఆమెకు దూరంగా ఉంటున్నారు. కానీ కల్వకుంట్ల కవిత మాత్రం అప్పుడప్పుడు బీఆర్ఎస్ పార్టీపై విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు.
మాజీ మంత్రి జగదీష్ రెడ్డి తన గురించి చులకనగా మాట్లాడుతున్నందుకు ఆగ్రహిస్తూ, “ఆయనో లిల్లీపుట్ నాయకుడని, అయన వలననే నల్గొండలో బీఆర్ఎస్ పార్టీ తుడిచిపెట్టుకుపోయిందని” కల్వకుంట్ల కవిత ఘాటుగా విమర్శించారు. అటువంటి పెద్ద తలకాయలే ఇతరుల చేత తనపై అనుచిత వ్యాఖ్యలు చేయిస్తున్నాయని కల్వకుంట్ల కవిత ఆరోపించారు.
ఆమె వ్యాఖ్యలపై జగదీష్ రెడ్డి చాలా ఆచితూచి స్పందించారు. “నా ఉద్యమ ప్రస్తానంపై కల్వకుంట్ల కవిత జ్ఞానానికి జోహార్లు. కేసీఆర్ శత్రువుల మాటలే ఆమె నోట వినిపిస్తున్నాయి. ఇందుకు ఆమెకు నా సానుభూతి తెలుపుతున్నాను,” అని అన్నారు.
బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్‌కి అత్యంత నమ్మకస్తుడు, సన్నిహితుడు, విధేయుడు జగదీష్ రెడ్డి. కేసీఆర్ తన కూతురు కల్వకుంట్ల కవితతో మాట్లాడేందుకు ఇష్టపడటం లేదు కానీ జగదీష్ రెడ్డి తదితరులతో తరచూ ఫామ్‌హౌసులో సమావేశమయ్యి పార్టీకి సంబందించిన విషయాల గురించి చర్చిస్తూనే ఉంటారు.
అటువంటి జగదీష్ రెడ్డికి ఆమెకు మద్య చిన్నగా మొదలైన ఈ యుద్ధం ఇక్కడితో ఆగకపోవచ్చు. కనుక దీంతో బీఆర్ఎస్ పార్టీలో కల్వకుంట్ల కవితని ఉంచుకోవాలా బహిష్కరించాలా? అని కేసీఆర్ తాడోపేడో తేల్చుకోవలసిన సమయం మరెంతో దూరంలో లేదని భావించవచ్చు.