ఆగస్ట్ 4న మంత్రివర్గ సమావేశం... ఏం జరుగబోతోంది?

August 02, 2025


img

సిఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఆగస్ట్ 4న మధ్యాహ్నం 2 గంటల నుంచి రాష్ట్ర సచివాలయంలో మంత్రివర్గ సమావేశం జరుగబోతోంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణా రావు పేరిట సాధారణ పరిపాలన (మంత్రివర్గం) విభాగం నోట్ జారీ చేసి మంత్రులందరికీ తెలియజేసింది. 

రెండు రోజుల క్రితమే పీసీ ఘోష్ కమీషన్‌ కాళేశ్వరం ప్రాజెక్టుపై తుది నివేదికని ప్రభుత్వానికి అందజేసినందున, దానిపై మంత్రివర్గ సమావేశంలో లోతుగా చర్చించే అవకాశం ఉంది. 

దీనిని శాసనసభలో చర్చించిన తర్వాత కేసీఆర్‌, హరీష్ రావు తదితరులపై కేసులు నమోదు చేయాలా లేదా కాంగ్రెస్‌ అధిష్టానానికి ముందుగా తెలియజేసి అనుమతి తీసుకోవాలా లేదా సరైన సమయం వచ్చే వరకు వేచి చూస్తూ ఆలోగా ఈ నివేదికలోని అంశాలను ప్రస్తావిస్తూ బీఆర్ఎస్‌ పార్టీని రాజకీయంగా ఇరుకున పెట్టాలా? మరేదైనా చేయాలా? అని మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నారు. కనుక కాంగ్రెస్‌ పార్టీకి మాత్రమేకాదు బీఆర్ఎస్‌ పార్టీకి కూడా ఈ సమావేశం చాలా కీలకమైనదే అని చెప్పవచ్చు. 

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి మంత్రివర్గం ఆమోదంతోనే చేపట్టామని మాజీ సిఎం కేసీఆర్‌, మాజీ మంత్రి హరీష్ రావు పీసీ ఘోష్ కమీషన్‌కు వాంగ్మూలం ఇచ్చారు. దీనిపై కమీషన్ కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని వివరణ కోరగా, రికార్డులు పరిశీలించి మంత్రివర్గం ఆమోదం తీసుకోలేదని స్పష్టం చేసింది.

కనుక కేసీఆర్‌ ఏకపక్ష నిర్ణయం తీసుకున్నట్లు కమీషన్ నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం. కనుక ఆగస్ట్ 4న జరుగబోయే మంత్రివర్గ సమావేశంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుందనేది చాలా ఆసక్తికరంగా మారింది.



Related Post