అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తాను ప్రపంచశాంతిని కాంక్షిస్తున్న శాంతికాముకుడిని, ‘నోబుల్ ప్రైజ్’కి అన్ని విధాల అర్హుడినని చెప్పుకుంటారు. మరో పక్క నాటో ద్వారా ఉక్రెయిన్‌కి ఆయుధాలు అందిస్తుంటారు. రష్యాని యుద్ధం మానేయమని హుకుం జారీ చేస్తారు. చేయకపోతే శాంతి స్థాపన కోసం యుద్ధం చేసేందుకు సిద్దమంటారు.
రష్యా మాజీ అధ్యక్షుడు దిమిత్రీ మెద్వదేవ్, “మా వద్ద ‘డెడ్ హ్యాండ్’ అణ్వాయుధ వ్యవస్థ ఉందంటూ” చెప్పగానే ట్రంప్ రెండు అణు జలాంతర్గాములను రష్యా వద్దకు పంపిస్తున్నారు. అత్యంత శక్తివంతమైన రష్యాని ఈవిదంగా రెచ్చగొట్టి సవాలు చేస్తూ అణు జలాంతర్గాములను వాడే అవసరం రాకపోవచ్చు అంటున్నారు.
భారత్ ప్రధాని మోడీ నా మిత్రుడు అంటూనే భారత్‌పై 25 శాతం సుంకాలు విధించి, భారత్ ఆర్ధిక వ్యవస్థని ‘డెడ్ ఎకానమీ’ అంటూ చీదరించుకున్నారు.
మరోపక్క అమెరికా ట్విన్ టవర్స్‌పై దాడులు చేసిన ఒసామా బిన్ లాడెన్ వంటి కరడుగట్టిన ఉగ్రవాదికి ఆశ్రయం కల్పించిన పాకిస్తాన్, నేటికీ ఉగ్రవాదులకు అడ్డాగా ఉందని తెలిసి ఉన్నప్పటికీ తొలుత ప్రకటించిన 23 శాతం సుంకాన్ని 19 శాతానికి తగ్గించి పాక్ పట్ల ట్రంప్ తన ప్రేమనిచాటుకున్నారు. భారత్ పట్ల తన వైఖరిని కూడా తనకు తానే బయటపెట్టుకున్నారు.
ఇలా నోటితో ఓ రకంగా మాట్లాడుతూ, వాటికి పూర్తి భిన్నంగా చేతలు ప్రదర్శిస్తుండటం కేవలం ట్రంప్‌కి మాత్రమే చెల్లునేమో?