ఆగస్ట్ 8న కరీంనగర్‌లో బీఆర్ఎస్‌ సభ

August 02, 2025


img

బీసీలకు 42 శాతం రిజర్వేషన్స్‌ పెంచేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం శాసనసభలో తీర్మానం ప్రవేశపెట్టగా బీఆర్ఎస్‌ పార్టీ మద్దతు పలికింది. కానీ అది పార్లమెంటు పరిధిలో ఉన్న అంశం కనుక రాష్ట్ర స్థాయిలో బీసీ రిజర్వేషన్స్‌ అమలు చేసేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసినప్పుడు, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత దానిని స్వాగతించగా, బీఆర్ఎస్‌ పార్టీ దానిని వ్యతిరేకిస్తూ రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేసింది. 

తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ ఈ నెల 5,6,7 తేదీలలో దీని కోసం ధిల్లీలో ధర్నా, రాష్ట్రపతిని కలిసి వినతి పత్రం ఇవ్వబోతుండటంతో కల్వకుంట్ల కవిత హడావుడిగా ప్రెస్‌మీట్‌ పెట్టి తాను ఈ నెల 4, 5,6 తేదీలలో నిరాహార దీక్ష చేస్తానని ప్రకటించారు. 

కాంగ్రెస్‌, తెలంగాణ జాగృతి ఈ అంశంపై దూసుకుపోతుండటంతో బీఆర్ఎస్‌ పార్టీ కూడా బరిలో దిగి ఈ నెల 8న కరీంనగర్‌ భారీ బహిరంగ సభ నిర్వహించబోతోంది. దీనిలో ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని బీసీలు పాల్గొనేలా చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచాలని భావిస్తోంది. 

కరీంనగర్‌ బీఆర్ఎస్‌ పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రులు గంగుల కమలాకర్, శ్రీనివాస్ మహేష్ కుమార్ గౌడ్‌, కొప్పుల ఈశ్వర్ శుక్రవారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి మట్లాడారు. 

తెలంగాణలో బీసీ జనాభా ఎక్కువ ఉన్నందున ఆ ప్రాతిపదికన రిజర్వేషన్స్‌ అమలుచేయాలని కోరారు. పదేళ్ళ క్రితమే కేసీఆర్‌ బీసీల సంక్షేమం కోసం ఆలోచించి అనేక కార్యక్రమాలు చేపట్టారని చెప్పారు. 

కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికలలో బీసీలకు రిజర్వేషన్స్‌ పెంచుతామని హామీ ఇచ్చి శాసనసభలో తీర్మానం చేసి దిల్లీకి పంపించి చేతులు దులుపుకుందని విమర్శించారు. రాజ్యాంగంలో 9వ షెడ్యూల్లో చేర్చితేనే 42 శాతం బీసీ రిజర్వేషన్స్‌ సాధ్యపడుతుందన్నారు. పార్లమెంటులో బీసీ రిజర్వేషన్స్‌ పెంపు ప్రతిపాదనని ఆమోదింపజేసుకునేందుకు కాంగ్రెస్‌ పార్టీ గట్టి ప్రయత్నాలు చేయకుండా మాయమాటలతో తెలంగాణ ప్రజలను మోసం చేస్తోందన్నారు.


Related Post