బీసీ రిజర్వేషన్స్ సాధన కోసం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సిఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ సీనియర్ నాయకులు ఆగస్ట్ 5,6,7 తేదీలలో ధిల్లీలో మూడు రోజుల పాటు ధర్నా చేయబోతున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. బీసీల కోసం కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఈ పోరాటంలో పార్టీలకు అతీతంగా అందరూ పాల్గోవాలని విజ్ఞప్తి చేశారు.
దీనిపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఘాటుగా స్పందిస్తూ, “బీసీ రిజర్వేషన్స్ సాధించాలనే చిత్తశుద్ది లేదు. ఉండి ఉంటే రాష్ట్రపతిపై సుప్రీంకోర్టులో కేసు వేయొచ్చు. రాష్ట్రంలో ప్రతిపక్ష నేతలందరికీ దీని గురించి ముఖ్యమంత్రి కార్యాలయం లేఖలు వ్రాసి ఆహ్వానించవచ్చు. లేదా అఖిలపక్షం వేసి ధిల్లీకి తీసుకువెళ్ళవచ్చు. కానీ మంత్రి పొన్నం ప్రభాకర్ మాటలు ఎలా ఉన్నాయంటే, సత్రంలో భోజనాలు పెడుతున్నాము తినడానికి అందరూ రండి అని పిలుస్తున్నట్లుంది. త్వరలో జరుగబోయే బీహార్ శాసనసభ ఎన్నికల కోసమే కాంగ్రెస్ పార్టీ ధిల్లీలో ఇలాంటి డ్రామాలు ఆడుతోంది తప్ప దానికి చిత్తశుద్ధి లేదు.
కానీ నేను తెలంగాణ జాగృతి అధ్యక్షురాలిగా, తెలంగాణ బిడ్డగా బీసీ రిజర్వేషన్స్ కోసం ఆగస్ట్ 4,5,6 తేదీలలో మూడు రోజుల పాటు నిరాహార దీక్ష చేస్తాను. నాడు ఉమ్మడి రాష్ట్రంలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు కోసం మూడు రోజులు దీక్ష చేసి ఏవిదంగా సాధించానో అదేవిదంగా ఇప్పుడు కూడా బీసీ రిజర్వేషన్స్ కోసం దీక్ష చేసి సాధిస్తాననే నమ్మకం నాకుంది,” అని కల్వకుంట్ల కవిత అన్నారు.
అంటే కాంగ్రెస్ పార్టీ చేసే దీక్ష దొంగ దీక్షలని తాను చేసే దీక్ష మాత్రం నిజాయితీతో, నిబద్దతతో కూడినదని కల్వకుంట్ల కవిత చెపుతున్నారన్న మాట! ‘బీసీ రిజర్వేషన్స్’ బీసీల కోసం కార్యక్రమంలో రాజకీయ అస్త్రంగా మారినందున దానిని, దాని క్రెడిట్ దక్కించుకోవడానికి పోటీలు మొదలైనట్లనిపిస్తోంది.