కార్గిల్ వీరులకు సెల్యూట్

July 26, 2025


img

అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రధానిగా ఉన్నప్పుడు పాక్‌కి స్నేహ హస్తం అందిస్తూ 1999 ఫిబ్రవరిలో ధిల్లీ నుంచి లాహోర్‌కి బస్సు యాత్ర చేసి లాహోర్‌లో పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్‌తో కలిసి ‘లాహోర్ డిక్లరేషన్’ ప్రకటించారు.

కానీ పాక్ సైనిక జనరల్‌గా ఉన్న పర్వేజ్ ముషరఫ్‌ బుర్రలో వేరే ఆలోచనలున్నాయి. ఎలాగైనా భారత్‌ అధీనంలో ఉన్న కశ్మీర్‌ని ఆక్రమించుకోవాలని తహతహలాడుతున్నారు. కనుక ‘లాహోర్ డిక్లరేషన్’ రెండు మూడు నెలలకే జమ్ము కశ్మీర్‌లోని లద్దాక్‌లోని కార్గిల్ పట్టణం వైపున్న పర్వత శ్రేణులపైకి ఉగ్రవాదుల ముసుగులో పాక్ సైనికులను ఆయుధాలతో రహస్యంగా పంపించడం మొదలుపెట్టారు.

మంచు విపరీతంగా కురుస్తున్న ఆ సమయంలో అక్కడ భారత సైనికులు ఉండరని గ్రహించిన పర్వేజ్ ముషారఫ్ కార్గిల్ పర్వత శ్రేణులలో కీలక ప్రాంతాలు తమ సైనికులు, భారీ ఆయుధాలలతో నింపేశారు. 

పాక్ విశ్వాస ఘాతుకానికి పాల్పడటంతో  ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి కార్గిల్ యుద్ధానికి అనుమతించారు. భారత్‌ దళాలు ‘ఆపరేషన్ విజయ్' పేరుతో 1999 మే నెలలో కార్గిల్ యుద్ధం మొదలుపెట్టి, పర్వతాలపై తిష్ట వేసుకున్న శత్రుమూకలన్నిటినీ మట్టుపెట్టి మళ్ళీ కార్గిల్ పర్వతాలపై మువ్వన్నెల జెండా ఎగురవేసింది.

జూలై 26న కార్గిల్ యుద్ధంలో విజయం సాధించినందున అప్పటి నుంచి ఏటా జూలై 26న ‘కార్గిల్ విజయ్ దివస్’ పేరిట ఆ యుద్ధంలో ప్రాణాలు పణంగా పెట్టి దేశ సరిహద్దులను కాపాడిన వీర జవాన్లకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఆ యుద్ధంలో అమరులైన 527 మంది సైనికులు, సైనికాధికారులకు నివాళులు అర్పిస్తున్నాము. 


Related Post