బీసీ రిజర్వేషన్స్ పెంపు ప్రతిపాదనపై తెలంగాణలో బీజేపి, బీఆర్ఎస్ పార్టీలు తలో రకంగా మాట్లాడుతుంటే, కాంగ్రెస్ అధిష్టానం దీనికి సంపూర్ణ మద్దతు తెలిపింది. నిన్న ధిల్లీలో సిఎం రేవంత్ రెడ్డి బృందంతో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, కాంగ్రెస్ ఎంపీలు రాహుల్ గాంధీ, ప్రియాంక వాద్రా తదితరులు సమావేశమయ్యారు.
వారికి తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి బృందం తెలంగాణలో జరిపిన కుల గణన, బీసీలకు జనాభా ప్రాతిపదికన 42 శాతం రిజర్వేషన్స్ పెంపు కోసం శాసనసభలో తీర్మానం చేసి రాష్ట్రపతికి పంపించడం వంటి విషయాలను వివరించారు.
వారి ప్రయత్నాలు, ప్రతిపాదనలను రాహుల్ గాంధీ మెచ్చుకున్నారు. పార్లమెంటులో ఇండియా కూటమి ఎంపీలు పోరాడి, రాజ్యాంగంలో 50 శాతం పరిమితిని తొలగింపజేసేందుకు గట్టిగా ప్రయత్నిస్తామని చెప్పారు. బీసీ రిజర్వేషన్స్ సాధన కోసం రేవంత్ రెడ్డి చేస్తున్న ప్రయత్నాలకు సంపూర్ణ మద్దతు ఇస్తామని రాహుల్ గాంధీ చెప్పారు.
రాహుల్ గాంధీ మద్దతు, ప్రశంశలు లభించడంతో కాంగ్రెస్ అధిష్టానం దృష్టిలో సిఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో మరో మెట్టు పైకి ఎక్కినట్లే భావించవచ్చు.
ఒకవేళ పార్లమెంటులో ఇండియా కూటమి ప్రయత్నాలు ఫలించి బీసీ రిజర్వేషన్స్ పెంపుకు రాజ్యాంగంలో ఉన్న అవరోధాలు తొలగించేందుకు కేంద్రం అంగీకరిస్తే, దేశ వ్యాప్తంగా బీసీ రిజర్వేషన్స్ అమలవుతాయి. కనుక తెలంగాణతో పాటు దేశ రాజకీయాలను మలుపు తిప్పిన వ్యక్తిగా సిఎం రేవంత్ రెడ్డి పేరు మారుమ్రోగిపోతుంది.
ఒకవేళ కేంద్రం అంగీకరించకపోయినా బీసీల కోసం పోరాడుతున్న పార్టీగా కాంగ్రెస్ పార్టీకి ‘కొత్త గుర్తింపు’ లభిస్తుంది. ఈ పార్లమెంట్ సమావేశాలలో కాంగ్రెస్ పార్టీ బీసీ రిజర్వేషన్స్ గురించి గట్టిగా పోరాడితే ఈ ప్రభావం ముందుగా త్వరలో జరుగబోయే బీహార్ శాసనసభ ఎన్నికలలో తప్పక కనిపిస్తుంది.
ఈ పోరాటాల వలన బీహార్‌లో కాంగ్రెస్ పార్టీ గెలిచి అధికారంలోకి రాగలిగితే, ఆ తర్వాత ఇదే ఫార్ములాతో ఇతర రాష్ట్రాలలోను అమలుచేస్తూ 2029 సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించగలుగుతుంది. కనుక కాంగ్రెస్ పార్టీకి ఓ శక్తివంతమైన అస్త్రం అందించిన సిఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీలో ఇక తిరుగు ఉండదు.