రేవంత్ రెడ్డిని ప్రతిపక్షాలు తక్కువ అంచనా వేశాయా?

July 24, 2025


img

తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో కులగణన చేపట్టినప్పుడు ప్రతిపక్షాలు విమర్శలు చేశాయి. కానీ వాటి విమర్శలు పట్టించుకోకుండా ముందుకుసాగి ఆ కార్యక్రమం పూర్తి చేశారు. దాని స్పూర్తితో కేంద్రం కూడా వచ్చే ఏడాది నుంచి జరుపబోయే జన గణన కార్యక్రమంలో కుల గణన కూడా చేపట్టాలని నిర్ణయించింది. ఈ క్రెడిట్ ఖచ్చితంగా సిఎం రేవంత్ రెడ్డికే దక్కుతుంది. 

అ తర్వాత బీసీ రిజర్వేషన్స్‌ అంశంతో సిఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర రాజకీయాలలో ప్రకంపనలు సృష్టించారు. కేంద్ర ప్రభుత్వం సహకరిస్తే తప్ప ఇది ఆయన అమలు చేయలేరని గ్రహించిన బీఆర్ఎస్‌, బీజేపిలు శాసనసభలో ఆ తీర్మానానికి మద్దతు పలికాయి. 

ఇదివరకు ముస్లిం రిజర్వేషన్స్ పెంపు కొరకు మాజీ సిఎం కేసీఆర్‌ కూడా ఇలాగే శాసనసభలో ఆ తీర్మానం చేసి ధిల్లీకి పంపించి చేతులు దులుపుకున్నారు. కనుక రేవంత్ రెడ్డి కూడా అలాగే చేతులు దులుపుకుంటారని కాంగ్రెస్‌, బీజేపిలు భావించాయి. కానీ పార్లమెంటులో కాంగ్రెస్‌ పార్టీకి ఎంపీలున్నారనే సంగతి అవి మరిచాయి.  

సిఎం రేవంత్ రెడ్డి తన మనసులో ఆలోచనలని నిన్న ధిల్లీలో బయటపెట్టారు. తాను కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీలను కలిసి బీసీ రిజర్వేషన్స్‌ కోసం తమ ప్రభుత్వం తీర్మానం చేసి కేంద్రానికి పంపిందని, దానిని ఆమోదింపజేసేందుకు ఈ పార్లమెంటు సమావేశాలలోనే కేంద్రంపై ఒత్తిడి తేవాలని కోరుతానని చెప్పారు. 

రాష్ట్ర ప్రభుత్వాలు పంపిన బిల్లులను రాష్ట్రపతి మూడు నెలల్లోగా ఆమోదించాలనే సుప్రీంకోర్టు తీర్పు విషయం కూడా తమ పార్టీ అధినేతలకు గుర్తుచేసి బీసీ రిజర్వేషన్స్‌ బిల్లు ఆమోదం కొరకు కేంద్రంపై ఒత్తిడి చేయాలనీ చెప్పారు. 

ఇండియా కూటమి ఎంపీలతో కూడా భేటీ అయ్యి బీసీ రిజర్వేషన్స్‌ అవసరమని వివరించి పార్లమెంటులో దీని కోసం పోరాడి ఈ బిల్లుని ఆమోదింపజేయాలని కోరుతానని సిఎం రేవంత్ రెడ్డి చెప్పారు. 

ఒకవేళ కేంద్రం బీసీ రిజర్వేషన్స్‌కు సహకరిస్తే ఒక్క తెలంగాణలో మాత్రమే కాకుండా యావత్ దేశంలో బీసీ రిజర్వేషన్స్‌ అమలవుతాయి కనుక ఆ క్రెడిట్ ఖచ్చితంగా సిఎం రేవంత్ రెడ్డికే దక్కుతుంది. 

ఒకవేళ కేంద్రం ఆమోదించకపోయినా, అప్పుడు కూడా శాసనసభలో తీర్మానం చేసి చేతులు దులుపుకోకుండా వీటి కోసం గట్టిగా పోరాడారనే క్రెడిట్ సిఎం రేవంత్ రెడ్డికే దక్కుతుంది. 

కనుక సిఎం రేవంత్ రెడ్డి ఏదో ఆషామాషీగా బీసీ రిజర్వేషన్స్‌ అంశాన్ని మొదలుపెట్టలేదని, దీనిని బ్రహ్మాస్త్రంగా ఉపయోగించుకొబోతున్నారని భావించవచ్చు. 


Related Post