తెలంగాణ ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే....

July 22, 2025


img

బీసీ రిజర్వేషన్స్‌ అమలుపై తెలంగాణ బీజేపి అధ్యక్షుడు ఎన్ రామచందర్ రావు ఆసక్తికరమైన వ్యాక్యాలు చేశారు. దిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, “రేవంత్ ప్రభుత్వం ఈ పేరుతో బీసీలను మభ్యపెట్టాలని ప్రయత్నిస్తోంది తప్ప రిజర్వేషన్స్ అమలుచేయాలనే చిత్తశుద్ధి లేదు.

దీని కోసం శాసనసభలో తీర్మానం చేసి ధిల్లీకి పంపించేసినంత మాత్రాన్న రాజ్యాంగంలో 9వ షెడ్యూలో చేర్చడం సాధ్యం కాదు. ముందుగా దీనిపై న్యాయసమీక్ష చేయాల్సి ఉంటుంది. తర్వాత పార్లమెంట్ ఆమోదం అవసరం ఉంటుంది.

ఈ రెండు సాధ్యంకావని తెలిసి ఉన్నప్పుడు బీసీ రిజర్వేషన్స్‌ అమలుచేస్తామని, కానీ కేంద్రం సహకరించడం లేదని నిందించడం దేనికి?

మధ్యప్రదేశ్‌లో గ్రామాన్ని ఒక యూనిట్‌గా తీసుకొని అక్కడి జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్స్‌ అమలుచేస్తున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ రాష్ట్రంలో కూడా అదేవిదంగా బీసీ రిజర్వేషన్స్‌ అమలుచేయవచ్చు. బీసీ రిజర్వేషన్స్‌ బీసీలకే పరమితం చేయాలి తప్ప బీసీ-ఈ కింద ముస్లింలకు విద్య, ఉద్యోగాలలో రిజర్వేషన్స్‌ కల్పిస్తామంటే బీజేపి తీవ్రంగా వ్యతిరేకిస్తుంది,” అని అన్నారు. 

బీసీ రిజర్వేషన్స్‌ కొరకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీనిని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్వాగతించగా, బీఆర్ఎస్‌ పార్టీ తప్పు పడుతూ నిరసనలు తెలియజేసింది.

కానీ సెప్టెంబర్‌ నెలాఖరులోగా తెలంగాణలో స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించినందున, త్వరలో జరుగబోయే శాసనసభ సమావేశాలలోనే బీసీ రిజర్వేషన్స్‌పై చర్చించి తుది నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది. 


Related Post