బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ వలన కంటే ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వల్లనే ఎక్కువ నష్టం జరుగుతున్నట్లనిపిస్తోంది. బీజేపీలో బీఆర్ఎస్ పార్టీ విలీనం అంటూ కల్వకుంట్ల కవిత చేసిన ఆరోపణ, కేటీఆర్ నాయకత్వాన్ని అంగీకరించబోనని చెప్పడం, బీసీ రిజర్వేషన్స్ విషయంలో కల్వకుంట్ల కవిత, కేటీఆర్ భిన్నంగా స్పందించడం, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు న్యూస్ ఛానల్‌పై దాడి, దానిని కేటీఆర్ సమర్ధించుకోవడం, చెల్లి కల్వకుంట్ల కవితపై తీన్మార్ మల్లన్న అనుచిత వ్యాఖ్యలు చేస్తే కేటీఆర్ ఖండించకపోవడం, వీటన్నిటి గురించి ఆమె అడుగుతున్న ప్రశ్నలకు సూటిగా సమాధానాలు చెప్పలేకపోవడం వంటివి బీఆర్ఎస్ పార్టీకి రాజకీయంగా చాలా నష్టం కలిగిస్తున్నాయి.
ఇవన్నీ సరిపోవన్నట్లు బీఆర్ఎస్ పార్టీ ఎంతగానో ద్వేషిస్తున్న ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు కుమారుడు, ఏపీ మంత్రి నారా లోకేష్‌తో కేటీఆర్ రహస్యంగా భేటీ అయ్యారని తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి మరో బాంబు పేల్చారు.
దానిని కేటీఆర్ గట్టిగా ఖండించకపోగా “నారా లోకేష్ నా తమ్ముడు లాంటివాడు. మా ఇద్దరికీ మంచి స్నేహం ఉంది. పైగా నారా లోకేష్ నాలాగే యువకుడు.. పొరుగు రాష్ట్రంలో మంత్రి. ఆయనని కలువలేదు. కానీ కలిస్తే తప్పేమిటి?ఆయనేమీ రేవంత్ రెడ్డిలాగా ఢిల్లీకి మూటలు మోయడం లేదు. దొంగతనం చేసి దొరికిపోలేదు కదా?” అని అన్నారు.
ఒకవేళ కేటీఆర్ నారా లోకేష్‌ని కలిసి ఉండకపోతే “నేను కలవలేదు దమ్ముంటే నిరూపించమని” సవాలు విసిరి ఉండేవారు. కానీ విసరలేదు! పైగా నారా లోకేష్ నా తమ్ముడు లాంటివాడు కలిస్తే తప్పేమిటి?అని ప్రశ్నించి సిఎం రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణ నిజమని ప్రజలు భావించేలా చేశారు.
బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం చేసేయాలనుకున్నారని కల్వకుంట్ల కవిత ఒక బాంబు పేల్చితే, ఇప్పుడు తెర వెనుక టీడీపీతో రాజీకి ప్రయత్నిస్తున్నారనే అనుమానం కలిగేలా మాట్లాడారు కేటీఆర్.
లోకేష్‌ను నేను కలవలేదు.. ఒకవేళ కలిసినా తప్పేంటి? లోకేష్ ఏమైనా రేవంత్ లాగా దొంగనా?
— KTR News (@KTR_News) July 18, 2025
రేవంత్ రెడ్డి లాగ చీకట్లో ఢిల్లీ వెళ్లి అమిత్ షా, మోడీ కాళ్ళు పట్టుకునే రాజకీయలు చేయము
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ pic.twitter.com/SONYRmczys