ఈ ఏడాది ఏప్రిల్ 22న జమ్ము కశ్మీర్ రాష్ట్రంలో పహల్గాంలో 26 మంది పర్యాటకులను కిరాతకంగా హత్య చేసిన ‘ది రెసిస్టెంట్ ఫ్రంట్’ని విదేశీ ఉగ్రవాద సంస్థగా, గ్లోబల్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ అని అమెరికా ప్రకటించింది.
ఇది పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న లష్కరే తయిబా ఉగ్రవాద సంస్థకు మరో ముసుగు సంస్థ అని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబీయో పేర్కొన్నారు. తద్వారా పహల్గాం దాడిలో ప్రాణాలు కోల్పోయినవారికి న్యాయం చేసేందుకు, ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి అమెరికా కట్టుబడి ఉందని స్పష్టం చేస్తున్నామని మార్కో రూబీయో అన్నారు.
అమెరికా చేసిన ఈ ప్రకటన భారత్ దౌత్య విజయమనే చెప్పాలి. ఎందుకంటే, ‘ది రెసిస్టెంట్ ఫ్రంట్’తో పాకిస్థాన్‌కు ఎటువంటి సంబంధమూ లేదని అది జమ్ము కశ్మీర్ కేంద్రంగా కశ్మీర్ విముక్తి కోసం పనిచేస్తున్న స్వాతంత్ర్య పోరాట సంస్థ అని పాక్ వాదించింది. కానీ అమెరికా చేసిన ప్రకటనతో పాకిస్థాన్ ముసుగు తొలగించినట్లయింది.
అమెరికా ప్రకటన వలన ఇప్పటికిప్పుడు ఏమీ జరుగకపోయినా, ఆ ఉగ్రవాద సంస్థ కదలికలు, ఆర్ధిక లావాదేవీలు, కమ్యూనికేషన్స్‌పై ఇక నుంచి అమెరికాతో సహా అంతర్జాతీయంగా నిఘా పెడతారు. కనుక కొంతవరకు దానిని కట్టడి చేయగలుగుతారు.
ఆపరేషన్ సింధూర్‌తోనే పాకిస్థాన్‌ని భారత్ చాలా గట్టి దెబ్బ తీసింది. ఒకవేళ పాక్ ప్రేరిత ఉగ్రవాదులు మళ్ళీ భారత్‌పై దాడిచేస్తే దానిని యుద్ధంగానే పరిగణిస్తామని భారత్ హెచ్చరించింది. ఇప్పుడు అమెరికా చేసిన ఈ తాజా ప్రకటనతో పాక్‌పై తదుపరి దాడులకు మార్గం సుగమం అయినట్లే భావించవచ్చు.
కనుక పాక్ ప్రభుత్వం ఉగ్రవాదులను కట్టడి చేయక తప్పదు. లేకుంటే ఉగ్రదాడి జరిగిన ప్రతీసరి పాక్ భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది.