తెలంగాణ మంత్రివర్గ సమావేశంలో త్వరలో జరుగబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్స్ కేటాయించాలని నిర్ణయించారు. దీని కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసి చట్ట సవరణ చేయాలని నిర్ణయించింది. దీనిపై బీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ జాగృతి స్పందన పూర్తి భిన్నంగా ఉండటం చాలా విచిత్రం.
కల్వకుంట్ల కవిత స్పందిస్తూ, “బీసీ రిజర్వేషన్స్ కోసం మేము చేసిన పోరాటాలతోనే ప్రభుత్వం దిగివచ్చి ఆర్డినెన్స్ జారీ చేసేందుకు సిద్దమైంది. దీంతో మేము ఒక మెట్టు ఎక్కి తొలి విజయం సాధించినట్లు భావిస్తున్నాను. కనుక తెలంగాణ జాగృతి సభ్యులు విజయోత్సవాలు జరుపుకోవాలని కోరుతున్నాను. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడితో సరిపెట్టకుండా బీసీలకు విద్యా, ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్స్ కొరకు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి రాజ్యాంగ సవరణ చేసేంతవరకు పోరాడుతూనే ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాను,” అని అన్నారు.
కానీ బీఆర్ఎస్ పార్టీ ఈ విషయంలో ప్రభుత్వ వైఖరిని తప్పు పడుతూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టింది. బీసీలని సిఎం రేవంత్ రెడ్డి మరోసారి మోసం చేయాలని ప్రయత్నిస్తున్నారంటూ ఆయన దిష్టిబొమ్మలు దగ్ధం చేస్తోంది. బీసీ రిజర్వేషన్స్ పెంపు కోసం కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ సవరణ చేయనప్పుడు, రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ ద్వారా చట్ట సవరణ చేసి రిజర్వేషన్స్ అమలుచేస్తామని చెప్పడం బీసీలను మోసం చేయడమే అని బీఆర్ఎస్ పార్టీ వాదిస్తోంది.