పాపం రాజాసింగ్.. సెల్ఫ్ గోల్ చేసుకున్నారే!

July 11, 2025


img

ఘోషా మహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామా లేఖని ఆమోదిస్తున్నట్లు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రకటించారు. ఈ మేరకు రాజాసింగ్ కూడా ఎక్స్‌ వేదికగా ధ్రువీకరించారు. 

తన రాజీనామాని ఆమోదించడంపై రాజాసింగ్ స్పందిస్తూ, “నేను పదవులు ఆశించి రాజకీయాలలో రాలేదు. నాది ఒకటే సిద్దాంతం హిందుత్వ. ఆ వాదానికి కట్టుబడే నేను బీజేపీలో చేరాను. దానికి కట్టుబడే ఇంతకాలం పనిచేశాను.

ఎప్పటికైనా తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలని కోరుకునేవారిలో నేను మొట్ట మొదటి వ్యక్తిని. రాష్ట్రంలో బీజేపీ కార్యకర్తల మనసులో ఉన్న ఈ కోరికని నేనుఅర్దం చేసుకోగలిగాను. కానీ మా అధిష్టానానికి చెప్పలేకపోయాను.

పార్టీ నాకు సముచిత గౌరవం ఇచ్చింది. మూడుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు నాకు టికెట్ ఇచ్చి ప్రోత్సహించింది. అందుకు నేను పార్టీకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. పార్టీలో లేకపోయినా నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు హిందుత్వ విధానానికే నేను కట్టుబడి ఉంటాను,” అని చెప్పారు. 

రాజాసింగ్ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడుగా పోటీ చేయాలని నామినేషన్ వేయబోతే పార్టీ పెద్దలు అడ్డుకున్నారు. ఆ కోపంతో ఆయన రాజీనామా చేయగా దానికి రాష్ట్ర బీజేపీ పెద్దలు ఆమోదించి తమ అధిష్టానానికి పంపించగా, వారి సిఫార్సు మేరకు జేపీ నడ్డా రాజాసింగ్ రాజీనామాను ఆమోదించారు. 

కనుక తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కావాలనుకున్న రాజాసింగ్ ఆవేశంతో రాజీనామా చేసి సెల్ఫ్ గోల్ చేసుకున్నారని చెప్పక తప్పదు. 


Related Post