తెలంగాణలో మూడు పార్టీలకు చెరో 100 సీట్లు.. ఎలాగబ్బా?

July 06, 2025


img

తెలంగాణలో 2028 ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ 100 సీట్లు గెలుచుకొని అధికారంలోకి వస్తుందని కేసీఆర్‌ ఇదివరకే చెప్పారు. బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ కూడా అదే చెపుతున్నారు. ఇటీవల ఎల్బీ స్టేడియంలో జరిగిన సభలో సిఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, “వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్‌ పార్టీ 100 సీట్లు గెలుచుకొని మళ్ళీ అధికారంలోకి వస్తుంది. వందకు ఒక్క సీటు తగ్గినా నాదే బాధ్యత,” అని ప్రకటించారు. 

కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీలు చెరో వంద తీసుకుంటున్నప్పుడు మనం ఎందుకు వదులుకోవాలని అనుకున్నారో ఏమో బీజేపి అధ్యక్షుడుగా బాధ్యతలు ఎన్‌ రామచందర్ రావు కూడా వంద సీట్లు గెలుచుకుంటామని చెప్పేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ, “కాంగ్రెస్‌ నాయకులు పొరపాటున నోరు జారి 100 ఎమ్మెల్యే, 15 ఎంపీ సీట్లు గెలుచుకుంటామని చెప్పినట్లున్నారు. కానీ 100/15 గెలుచుకోబోయేది బీజేపియే,” అని అన్నారు. 

కనుక తెలంగాణలో మూడు పార్టీలు చెరో 100 ఎమ్మెల్యే సీట్లు, 15 ఎంపీ సీట్లు తమ పద్దులో వ్రాసేసుకొని సంతోషపడుతున్నాయన్న మాట! కానీ తెలంగాణలో 119/17 సీట్లు మాత్రమే ఉన్న సంగతి వారికీ తెలుసు. 

ప్రజలు ఇప్పటికే బిఆర్ఎస్, కాంగ్రెస్‌ పార్టీల పాలన ఎలా ఉంటుందో రుచి చూశారు. కనుక ఒకవేళ బీజేపిని కూడా రుచి చూడాలనుకుంటే వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్‌, బిఆర్ఎస్ పార్టీలకు భంగపాటు తప్పదు. కానీ బిఆర్ఎస్ పార్టీ పాలనలోనే రాష్ట్రం అభివృద్ధి చెందిందని భావిస్తే కాంగ్రెస్‌, బీజేపిలకు భంగపాటు తప్పదు. 

మిగిలిన ఈ మూడున్నరేళ్ళలో కాంగ్రెస్‌ ప్రభుత్వం పనితీరు మెరుగు పరుచుకొని ప్రజల ఆదరణ పొందేందుకు అవకాశం ఉంది. ఈ విషయం కాంగ్రెస్‌ గ్రహిస్తే మంచిది.  


Related Post