మాజీ మంత్రి, బిఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఈరోజు తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ సిఎం రేవంత్ రెడ్డికి ఓ సూటి ప్రశ్న వేశారు. “ప్రభుత్వ రికార్డుల ప్రకారమే మేడిగడ్డ బ్యారేజ్ వద్ద ప్రస్తుతం 73,600 క్యూసెక్కులు ప్రవహిస్తున్నాయి.
గోదావరి నీటి మట్టం 93.5 మీటర్లు ఉంటే కన్నెపల్లి పంప్ హౌసులో మోటర్లు ఆన్ చేసి రెండు టీఎంసీలు ఎత్తిపోసుకోవచ్చు. కానీ ఇప్పుడు నీటి మట్టం 96 మీటర్లుంది. ఇంత నీరు ప్రవహిస్తున్నా పక్కనే ఉన్న కన్నెపల్లి పంప్ హౌసులో మోటర్లు ఆన్ చేసి నీళ్ళు ఎందుకు ఎత్తిపోయడం లేదు?నీళ్ళున్నాయి, పక్కనే పంపులున్నాయి. కరెంటుంది. అన్నీ ఉన్నా మోటర్లు ఆన్ చేసి నీళ్ళు ఎందుకు ఎత్తిపోసి రిజర్వాయర్లని నింపడం లేదు?
అన్నారం, సుందిళ్ళ బ్యారేజీలు పతిష్టంగానే ఉన్నాయని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి లిఖిత పూర్వకంగా తెలియజేశారు. కనుక గోదావరి నీటితో వాటిని నింపి రైతులకు నీళ్ళు అందించవచ్చు కదా? కానీ కేసీఆర్ మీద కోపం, ద్వేషంతో గోదావరి నీటిని వృధాగా దిగువకు వదిలేస్తూ రైతులను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు?” అని హరీష్ రావు ప్రశ్నించారు.
ఆయనేమన్నారో ఆయన మాటల్లోనే..