ఎన్ రామచంద్ర రావు నేడు హైదరాబాద్‌లో పార్టీ కార్యాలయంలో తెలంగాణ బీజేపి అధ్యక్షుడుగా బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, “ఎన్నికలప్పుడు రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క ఊరూరూ తిరుగుతూ ఆరు గ్యారెంటీల కరపత్రాలు సంతకాలు చేసి మరీ ప్రజలకు పంచి పెట్టారు. వాటికి అనుబందంగా మరో 63 హామీలు కూడా ఇచ్చారు.
ప్రజలు వారిద్దరి హామీలను నమ్మి ఓట్లేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 600 రోజులవుతున్నా ఇంత వరకు వాటిని అమలు చేయలేదు. ఎప్పటికైనా అమలుచేస్తారో లేదో కూడా చెప్పలేకపోతున్నారు.
ఏమంటే ప్రభుత్వ ఆర్ధిక పరిస్థితి బాగోలేదంటున్నారు. కానీ ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో నెట్టేస్తున్నారని మీరే ఆరోపణలు చేశారు. కనుక రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి బాగోలేదనే విషయం మీకు తెలియకనే ప్రజలకు హామీలు ఇచ్చారనుకోలేము. కానీ తెలిసి ఇచ్చారంటే వాటితో ప్రజలను మభ్యపెట్టి ఎన్నికలలో గెలిచి అధికారం చేజిక్కించుకుంటే చాలనుకోవడం వల్లనే కదా? “ అని సూటిగా ప్రశ్నించారు.
ఎన్ రామచంద్ర రావుని తెలంగాణ బీజేపి అధ్యక్షుడుగా ప్రకటించినప్పుడు రాజకీయ విశ్లేషకులు పెదవి విరిచారు. బీజేపి మళ్ళీ మరోసారి బిఆర్ఎస్ పార్టీ కోసం బలిదానం చేసుకోవడానికి సిద్దపడిందని అభిప్రాయపడ్డారు. బిఆర్ఎస్ పార్టీని బీజేపిలో విలీనం చేసే ఆలోచన జరుగుతోందని కల్వకుంట్ల కవిత చెప్పారు.
కానీ అందుకు బండి సంజయ్, ధర్మపురి అరవింద్ ఇద్దరూ ఒప్పుకోరు కనుకనే ఎన్ రామచంద్ర రావుని ఈ పదవికి ఎంపిక చేశారనే వాదనలు వినిపించాయి. కనుక కాదని నిరూపించుకోవలసిన అవసరం ఉంది.
అందుకు ఆయన ముందుగా బిఆర్ఎస్ పార్టీపై దండయాత్ర మొదలుపెడతారనుకుంటే అధికార కాంగ్రెస్‌పై మొదలుపెట్టారు. విలీనం వార్తల నేపధ్యంలో ఆయన బిఆర్ఎస్ పార్టీతో ఏవిదంగా వ్యవహరిస్తారో?