శుక్రవారం ఎల్బీ స్టేడియంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన సామాజిక సమర న్యాయ భేరి సభలో కాంగ్రెస్ పార్టీ జాతీయధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ప్రసంగిస్తూ ప్రధాని మోడీకి కొన్ని సూటి ప్రశ్నలు వేశారు. అవి చాలా ఆలోచింపజేసేవే. కానీ వాటికి సమాధానాలకు బదులు బీజేపి నుంచి ప్రతి విమర్శలు, ఎదురుదాడి ఉండవచ్చు. ఖర్గే ఏమన్నారో క్లుప్తంగా..
• దేశంలో ప్రతిపక్షాలన్నీ కేంద్రానికి మద్దతు పలికినా ఆపరేషన్ సింధూర్‌ని అర్ధాంతరంగా ఎందుకు నిలిపివేశారు? పాకిస్థాన్‌ని మోకాళ్ళ మీద కూర్చోబెట్టామని చెప్పుకున్నప్పుడు, పాక్ ఆక్రమిత కశ్మీర్‌ని స్వాధీనం చేసుకోకుండా ఎందుకు విడిచిపెట్టేశారు?
• భారత్-పాక్ యుద్దాన్ని (ఆపరేషన్ సింధూర్)ని నేనే ఆపానని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చెప్పుకున్నప్పుడు ఎందుకు ఖండించలేదు?భారత్ దేశ భద్రత, రక్షణ విషయంలో ఇది అమెరికా తల దూర్చడం కాదా?
• పహల్గాం దాడి తర్వాత అఖిల పక్షసమావేశం ఏర్పాటు చేసి మీరు ఎందుకు హాజరుకాలేదు?దేశ భద్రత కంటే మీకు బీహార్ ఎన్నికల ప్రచారం ముఖ్యమా?
• నెహ్రూ, ఇందిరా గాంధీ హయంలో కేంద్ర ప్రభుత్వ రంగంలో హెచ్ఏఎల్, బీహెచ్ఈఎల్, బీఈఎల్, స్టీల్ ప్లాంట్స్ ఇంకా అనేక పరిశ్రమలు ఏర్పాటు చేసి లక్షలాదిమందికి ఉద్యోగాలు, ఉపాధి కల్పించారు. కానీ మీరు కొత్తగా ఎన్ని పరిశ్రమలు ఏర్పాటు చేశారు? ఎంత మందికి ఉద్యోగాలు కల్పించారు?
• మీరిప్పటి వరకు 42 దేశాలు తిరిగారు. కానీ మణిపూర్ అల్లర్లతో అల్లాడిపోయిన ప్రజలను పరామర్శించేందుకు మీకు సమయం లేదా?
• రాజ్యాంగంలో సెక్యులర్, సోషలిస్ట్ అనే పదాలు లేనేలేవని ఓ ఆర్‌ఎస్ఎస్ పెద్దాయన అన్నారు. ప్రధాని మోడీ, అమిత్ షాలకు దమ్ముంటే ఆ రెండు పదాలను రాజ్యాంగంలో నుంచి తొలగించాలని నేను సవాలు విసురుతున్నాను.