ఏపీ డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్‌పై చెన్నైలో అన్నా నగర్ పోలీస్ స్టేషన్‌లో కొందరు వ్యక్తులు పిర్యాదు చేశారు. ఇటీవల మధురైలో మురుగన్ భక్తుల ఆధ్వర్యంలో జరిగిన ‘మురుగ భకతర్గల్ మానాడు’ ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఆ సభలో ఆయన మత విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడారంటూ మధురై పీపుల్ ఫెడరేషన్ ఫర్ కమ్యూనల్ హార్మోనీ సంస్థ సభ్యులు పవన్ కళ్యాణ్‌పై అన్నా నగర్ పోలీస్ స్టేషన్‌లో పిర్యాదు చేశారు.
పవన్ కళ్యాణ్‌కి తమిళనాడుతో బలమైన అనుబంధం ఉంది. సినీ అభిమానులు కూడా ఉన్నారు. ఏపీలో జనసేన బీజేపితో కలిసి సాగుతున్నందున, తమిళనాడులో బీజేపి రాజకీయంగా నిలదొక్కుకొని అధికారంలోకి వచ్చేందుకు బహుశః పవన్ కళ్యాణ్ సాయం తీసుకుంటున్నట్లుంది.
తమిళనాడులో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అన్నా డీఎంకే పార్టీ బీజేపికి మిత్రపక్షంగా ఉంది. కనుక పవన్ కళ్యాణ్ దానికి అనుకూలంగా మాట్లాడుతున్నారు. అప్పుడప్పుడు తమిళనాడులో పర్యటిస్తున్నారు. తమిళనాడు రాజకీయాల గురించి మాట్లాడుతున్నారు.
పవన్ కళ్యాణ్ సనాతన ధర్మ పరిరక్షణ పేరుతో తమిళనాడులో చేస్తున్న రాజకీయాలతో తమకు నష్టం జరుగుతుందని అధికార డీఎంకే పార్టీ కూడా గ్రహించి అప్రమత్తమైంది. ఈ కేసుకి, డిఎంకే పార్టీకి ఏమైనా సంబంధం ఉందో లేదో తెలియవలసి ఉంది.