కంచ గచ్చిబౌలి భూవివాదంపై సిఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శనివారం కొండాపూర్ వద్ద పీజేఆర్ ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవం సందర్భంగా మాట్లాడుతూ, “కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల ప్రభుత్వ భూమిని ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళిపోతే మా ప్రభుత్వం సుప్రీంకోర్టులో పోరాడి కాపాడుకున్నాం.
ఆ భూములలో ఐటి టవర్లు నిర్మించి యువతకు ఉద్యోగాలు కల్పించాలనుకుంటే ప్రతిపక్షాలు అడ్డుకున్నాయి. నేను విదేశాలలో తిరిగి హైదరాబాద్‌కు ఐటి కంపెనీలు సాధించుకు వస్తే వాటికి ప్రతిపక్షాలు అడ్డుపడ్డాయి.
కానీ ఎన్ని అవరోధాలు ఎదురైన కంచ గచ్చిబౌలి భూములలో తప్పకుండా ఐటి టవర్లు నిర్మిస్తాం. వాటిలో రెండు లక్షల మందికి ఉద్యోగాలు, ఉపాధి కల్పిస్తాం,” అని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు.
కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల అటవీ భూమిని ప్రభుత్వం ఐసీఐసీఐ బ్యాంక్ వద్ద తనఖా పెట్టి రూ. 10,000 కోట్లు అప్పు తీసుకోవడం, అందుకోసం మద్యవర్తి కంపెనీకి రాష్ట్ర ప్రభుత్వం రూ.169.83 కోట్లు ఫీజు చెల్లించడం సెబీ నిబందనలను ఉల్లంఘించడమే అంటూ మాజీ మంత్రి, బిఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు తెలంగాణ ప్రభుత్వంపై సెబీకి పిర్యాదు చేశారు.
ఈ భూముల వ్యవహారంపై సుప్రీంకోర్టు నియమించిన ప్రత్యేక కమిటీ క్షేత్రస్థాయిలో పరిశీలించి వాటిని అటవీ భూమిగా గుర్తించి నివేదిక ఇచ్చిందని, ఆ భూములలో పచ్చటి చెట్లను నరికివేసినందుకు సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిందని హరీష్ రావు తన పిర్యాదులో పేర్కొన్నారు.
ఈ వ్యవహారంలో సుప్రీంకోర్టు కూడా జోక్యం చేసుకున్నప్పుడు ఆ భూములలో ప్రభుత్వం ఐటి టవర్లు ఏవిదంగా నిర్మించగలదు?కాలమే సమాధానం చెపుతుంది.