తెలంగాణ బీజేపి నేతలు కిషన్ రెడ్డి, బండి సంజయ్, రఘునందన్ రావు తదితరులు ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణపై చేస్తున్న వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ ఘాటుగా స్పందించింది.
ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ ఎంతకీ పూర్తిచేయకుండా డైలీ సీరియల్లా సాగదీస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం కాలక్షేపం చేస్తోందని, ఈ కేసులో కేసీఆర్, కేటీఆర్‌లను కాపాడేందుకే విచారణ పేరుతో కాలక్షేపం చేస్తోందని బీజేపి నేతలు పదేపదే ఆరోపిస్తున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉన్నట్లయితే కేసు విచారణ పూర్తిచేసి, దీనికి కారకులైన కేసీఆర్, కేటీఆర్‌లపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ కేసీఆర్, కేటీఆర్‌లపై చర్యలు తీసుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి ధైర్యం లేకపోతే, ఈ కేసుని సీబీఐకి అప్పగించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
దీనికి కాంగ్రెస్ పార్టీ ఘాటుగా బదులిస్తూ, “సీబీఐ అనేది నిజానికీ విచారణ సంస్థా... లేక మీ రాజకీయ బొమ్మల నాటకశాలా? మీ చీకటి దోస్తానాన్ని కాపాడుకోవడానికేనా కిషనాలూ? సీబీఐతో మీరు ఆడిన ఆటల్ని దేశం మొత్తం చూసింది!
ఈ ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని కూడా సీబీఐకి అప్పగించి.. బీఆర్ఎస్ నేతల్ని బెదిరించి బీజేపీలో కలిపే స్కెచ్ వేసారా కిషన్‌రెడ్డి గారు? ఒక్కసారి ముందుగా మీ కేంద్ర సర్కార్‌ను అడిగి, సీబీఐలో ఉద్యోగుల కొరత తొలగించండయ్యా!లేదంటే ఇంకెన్ని కుట్రలకి పని చేయించబోతున్నారు?” అని ఎక్స్ సోషల్ మీడియాలో ప్రశ్నించింది.