తెలంగాణ బీజేపి అధ్యక్షుడుగా ఉన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పదవీకాలం ముగియడంతో ఆయన స్థానంలో కొత్త అధ్యక్షుడుని బీజేపి అధిష్టానం ఎంపిక చేయబోతోంది. అధ్యక్షుడు ఎన్నికకి ఆదివారం నోటిఫికేషన్ జారీ చేసి సోమవారం నామినేషన్స్ స్వీకరించి మంగళవారం ఎన్నిక నిర్వహించి కొత్త అధ్యక్షుడుని ప్రకటిస్తామని బీజేపి ప్రకటించింది.
కిషన్ రెడ్డి అధ్యక్షుడుగా నియమించబడినప్పుడే అయిష్టంగా బాధ్యతలు చేపట్టారు కనుక మళ్ళీ ఆయన మరోసారి అధ్యక్షుడుగా కొనసాగేందుకు అంగీకరించకపోవచ్చు. బీజేపి అధ్యక్ష పదవి కోసం బండి సంజయ్, ఈటల రాజేందర్, రఘునందన్ రావు, డికే అరుణ పోటీ పడుతున్నారు.
వీరిలో చాలా దూకుడుగా వ్యవహరించే బండి సంజయ్ ఇదివరకే తన సత్తా చాటుకున్నారు. రఘునందన్ రావు మంచి వక్త. న్యాయవాది కనుక న్యాయపరమైన అంశాలపై ఇటు అధికార కాంగ్రెస్ పార్టీని, అటు బిఆర్ఎస్ పార్టీని కూడా గట్టిగా ఎండగడుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు.
బిఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన ఈటల రాజేందర్ చాలా బలమైన నాయకుడే కానీ ఇంత వరకు తన శక్తి సామర్ధ్యాలు నిరూపించుకోలేదు. కానీ కేసీఆర్‌తో సహా బిఆర్ఎస్ పార్టీ నేతలందరి బలాలు, బలహీనతలు, వారి రహస్యాలు అన్నీ ఆయనకు బాగా తెలిసుండటం ఆయనకి కలిసివచ్చే అంశం.
రాజకీయాలలో డికె అరుణ చాలా సీనియర్ నాయకురాలైనప్పటికీ, ఆమె కూడా ఇంతవరకు బీజేపి తన శక్తి సామర్ధ్యాలు నిరూపించుకోలేదు.
ఈటల రాజేందర్, డికె అరుణ బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నుంచి వచ్చినవారు కాగా బండి సంజయ్, రఘునందన్ రావు మొదటి నుంచి బీజేపిలోనే ఉన్నారు. ఇది వీరిద్దరికీ కలిసి వచ్చే అంశం. కనుక వీరిద్దరిలో ఎవరో ఒకరికి ఈ పదవి దక్కే అవకాశం కనిపిస్తోంది.