బనకచర్ల పేరుతో బిఆర్ఎస్ పార్టీ చేస్తున్న రాజకీయాలకు సిఎం రేవంత్ రెడ్డి తనదైన శైలిలో ఘాటుగా జవాబు చెపుతూ చిన్న ట్విస్ట్ ఇచ్చారు. నిన్న హైదరాబాద్‌లో జరిగిన రైతునేస్తం సభలో సిఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, “ఏపీ మాజీ మంత్రి రోజా ఇంట్లో రొయ్యల పులుసు తిని రాయలసీమకు గోదావరి జలాలు ఇస్తానని చెప్పింది నువ్వు కాదా అని కేసీఆర్‌ని అడుగుతున్నా?
ఆనాడు 2016 లో గోదావరి నుంచి నీళ్ళు తీసుకోవచ్చని కేంద్రజలశక్తి మాజీ మంత్రి ఉమాభారతి ముందు గోదావరి నీళ్ళు రాయలసీమకు ఇస్తామని నువ్వు చెప్పబట్టే కదా హంద్రీనీవాకు నీళ్ళు తరలించేందుకు 2016లో జీవో ఇచ్చిన మాట వాస్తవమా కాదా? అని అడుగుతున్నా.
గోదావరి నీళ్ళని తరలించుకుపోమని చెప్పింది నువ్వే ఇప్పుడు అభ్యంతరం చెపుతున్నది నువ్వే. ఫామ్‌హౌస్‌లో పడుకొని బనకచర్ల గురించి మాట్లాడించడం కాదు. కేసీఆర్ నీకు దమ్ముంటే శాసనసభకు రా. అక్కడ నువ్వు నేను ఈ ప్రాజెక్టు గురించి, తెలంగాణకు ఎవరు అన్యాయం చేశారో మాట్లాడుకుందాము,” అని సవాలు విసిరారు.
ఏడాదిన్నరగా శాసనసభకు మొహం చాటేస్తున్న కేసీఆర్ ఇక ముందు కూడా రారని సిఎం రేవంత్ రెడ్డి బాగానే గ్రహించారు. కనుక దమ్ముంటే రమ్మనమని సవాలు విసిరారు.
ఒకవేళ కేసీఆర్ శాసనసభకు వచ్చినా అప్పటికి కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమీషన్ నివేదిక చేతికి వస్తుంది. కనుక దానిని చూపిస్తూ కేసీఆర్‌ని గట్టిగా నిలదీయవచ్చు.
బనకచర్లపై టీవీ ఛానల్స్‌లో స్టూడియోలలో కాదు దమ్ముంటే శాసనసభలో చర్చిద్దాం అంటూ సిఎం రేవంత్ రెడ్డి సవాలు విసిరి ఈ అంశంపై హరీష్ రావు, కేటీఆర్ చేస్తున్న రాజకీయాలకు సిఎం రేవంత్ రెడ్డి చాలా తెలివిగా సమాధానం ఇచ్చారు.