ఫోన్ ట్యాపింగ్‌ కేసు: ఫిలిమ్ ఛాంబర్ అధ్యక్షుడు వాంగ్మూలం

June 24, 2025


img

తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్‌ కేసులో వివిద రంగాలకు చెందిన సుమారు 600 మందికి పైగా బాధితులున్నారని ఇదివరకే స్పష్టమైంది. వారిలో తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు భరత్ భూషణ్ కూడా ఒకరు. 2023 ఎన్నికలకు ఆరు నెలల ముందు నుంచి తన ఫోన్‌ ట్యాపింగ్ జరిగిందని ఆయన ఆరోపించారు. 

కనుక ఈ కేసుపై విచారణ జరుపుతున్న సిట్ అధికారులు ఆయనని వాంగ్మూలం ఇవ్వాలని కోరుతూ నోటీస్ పంపారు. సోమవారం ఉదయం ఆయన జూబ్లీహిల్స్‌ పోలీస్ స్టేషన్‌కు వచ్చి తన వాంగ్మూలం ఇచ్చి వెళ్ళారు. ఈ కేసులో పలువురు ప్రతిపక్ష నేతల ఫోన్లు కూడా ట్యాపింగ్ జరిగినట్లు గుర్తించిన సిట్ అధికారులు బీజేపి ఎంపీ ఈటల రాజేందర్‌, తెలంగాణ బీజేపి ఉపాధ్యక్షుడు గంగిడి  మనోహర్ రెడ్డి, బీజేపి ప్రధాన కార్యదర్శి గుజ్జల ప్రేమేందర్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్‌ గౌడ్‌ ఇంకా పలువురికి నోటీసులు పంపించి వాంగ్మూలాలు తీసుకుంటున్నారు. 

వందలమంది ఫోన్ ట్యాపింగ్‌ బాధితులు వచ్చి వాంగ్మూలాలు ఇస్తున్నందున కాళేశ్వరం కేసులో మాజీ సిఎం కేసీఆర్‌ తప్పించుకోగలిగినా, ఫోన్ ట్యాపింగ్‌ కేసులో తప్పించుకోవడం కష్టమే కావచ్చు. బహుశః అందుకే బిఆర్ఎస్ పార్టీ నేతలు కాళేశ్వరం కేసు గురించి గట్టిగా మాట్లాడుతున్నారు కానీ ఈ ఫోన్ ట్యాపింగ్‌ కేసు గురించి అసలు మాట్లాడటం లేదేమో?


Related Post