ఫోన్ ట్యాపింగ్ కేసులో మళ్ళీ హడావుడి.. తాత్కాలికమేనా?

June 17, 2025


img

తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు దాదాపు ఏడాది పాటు స్థబ్ధుగా ఉండిపోవడంతో ఆ కేసు అటకెక్కిపోయిందనే అనుకున్నారు. కానీ ఈ కేసులో సూత్రధారి ప్రభాకర్ రావు హైదరాబాద్‌ తిరిగి రావడంతో మళ్ళీ హడావుడి మొదలైంది. ఇప్పటికే రెండుసార్లు విచారణకు హాజరైన ప్రభాకర్ రావు, సోమవారం మరోసారి విచారణకు హాజరయ్యారు. 

పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్‌ గౌడ్‌, గద్వాల మాజీ జెడ్పీటీసీ చైర్ పర్సన్ సరిత కూడా ఈరోజు విచారణకు హాజరయ్యారు. వారిద్దరూ కూడా తమ ఫోన్లు ట్యాపింగ్ అయ్యాయని పిర్యాదులు చేసినందున ఈ కేసుపై విచారణ జరుపుతున్న సిట్ బృందం వారికీ నోటీసులు పంపడంతో ఇద్దరూ జూబ్లీహిల్స్‌ పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరయ్యారు. 

కాళేశ్వరం కేసు, ఫోన్ ట్యాపింగ్ కేసు రెండింటి విచారణ ఒకేసారి కొలిక్కి వస్తుండటంతో బిఆర్ఎస్ పార్టీకి ఆందోళన కలిగించే విషయమే. ఈ రెండింటిలో ఏదో ఓ కేసులో కేసీఆర్‌ అరెస్ట్‌ అనివార్యంగానే కనిపిస్తోంది.  వీటిలో ఫోన్ ట్యాపింగ్ చాలా తీవ్రమైన నేరం. కనుక ఈ కేసులో అరెస్ట్‌ అయితే బిఆర్ఎస్ పార్టీకి అది మరణ శాశనమే అవుతుంది. 

కానీ కేసీఆర్‌, కేటీఆర్‌, హరీష్ రావులపై ఎటువంటి చర్యలు తీసుకోకుండా కేంద్ర ప్రభుత్వం అడ్డుపడుతోందని సిఎం రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పారు కనుక ఈ రెండు కేసులు ఎంత దూరం వెళ్తాయి? ఎంత కాలం సాగుతాయి?అనేది మిలియన్ డాలర్ ప్రశ్న.


Related Post