ఇటీవల జస్టిస్ పీసీ ఘోష్ కమీషన్ ఎదుట విచారణకు హాజరైన మాజీ సిఎం కేసీఆర్, మాజీ మంత్రులు హరీష్ రావు, ఈటల రాజేందర్ మంత్రివర్గం ఆమోదంతోనే కాళేశ్వరం ప్రాజెక్టుని నిర్మించామని చెప్పారు.
కనుక దీనిలో నిజానిజాలు తెలుసుకునేందుకు మంత్రివర్గ తీర్మానాల కాపీలు అందజేయాలని కోరుతూ జస్టిస్ పీసీ ఘోష్ కమీషన్ తెలంగాణ ప్రభుత్వానికి ఈ నెల 13న ఓ లేఖ వ్రాసింది. కానీ అటువంటి తీర్మానాలు ఏవీ లేకుండానే కేసీఆర్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు కట్టేసిందని చెపుతోంది.
అయితే ఇదే విషయం లిఖిత పూర్వకంగా తెలియజేయాల్సి ఉంటుంది. లేదా కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబందించి కేసీఆర్ ప్రభుత్వం ఎటువంటి నిర్ణయాలు తీసుకుందో తెలియజేసే రికార్డులు సమర్పించాల్సి ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ, మంత్రివర్గ తీర్మానాల కాపీలు అందజేయాలని కోరుతూ కమీషన్ ప్రభుత్వానికి లేఖ వ్రాయడం ఈ కేసులో చాలా కీలక పరిణామమే.
ఇది దేనికి దారి తీస్తుందో రాబోయే రోజుల్లో తెలుస్తుంది. జూలై నెలాఖరుతో జస్టిస్ పీసీ ఘోష్ కమీషన్ గడువు ముగుస్తుంది.
కనుక ఆలోగా విచారణ పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించాల్సి ఉంటుంది. ఒకవేళ ప్రభుత్వం ఆ నివేదిక ఆధారంగా కేసులు నమోదు చేయాలనుకుంటే ఆగస్ట్ నెలలో నమోదు చేసే అవకాశం ఉంటుంది.