సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న ప్రభాకర్ రావుని సిట్ అధికారులు శనివారం సుమారు 9 గంటల సేపు ప్రశ్నించి అనేక వివరాలు రాబట్టినట్లు తెలుస్తోంది. రాజకీయ అవసరాల కోసమే ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు ఆయన అంగీకరించినట్లు తెలుస్తోంది.
అయితే దీని వలన భవిష్యత్‌లో సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు ఫోన్ ట్యాపింగ్ చేయబడిన బాధితులు అందరూ మావోయిస్టులకు రహస్యంగా డబ్బు అందజేస్తున్నారనే సాకుని పెట్టినట్లు తెలుస్తోంది.
రాజకీయ నిఘా కోసమే ఫోన్ ట్యాపింగ్ చేశామని ప్రభాకర్ రావు చెప్పడం నిజమే అయితే ఈ వ్యవహారం అంతా కేసీఆర్ హయంలోనే జరిగింది కనుక ఆయన లేదా బిఆర్ఎస్ మంత్రులు ఆదేశం మేరకు వారు ఈ అకృత్యాలు చేసినట్లు స్పష్టమవుతుంది.
దీంతో తమకు ఎటువంటి సంబందమూ లేదని, ఫోన్ ట్యాపింగ్ జరిగి ఉంటే దానికి అది చేసిన అధికారులే బాధ్యత వహించాలని ఇదివరకు కేసీఆర్ అన్నారు.
కానీ ప్రభాకర్ రావు నోరు విప్పి నిజాలన్నీ బయటపెడితే, వాటిని నిరూపించేందుకు సిట్ అధికారులు బలమైన సాక్ష్యాలు సేకరించగలిగితే, ఈ కేసు కేసీఆర్ తదితరుల మెడకు చుట్టుకోవడం ఖాయం. ముఖ్యంగా హైకోర్టు జడ్జీల ఫోన్లు కూడా ట్యాపింగ్ జరిగినట్లు సిట్ పేర్కొంటోంది. కనుక ఈ కేసు కోర్టుకి వెళితే కేసీఆర్ & కో దీని నుంచి తప్పించుకోవడం చాలా కష్టమే కావచ్చు.
ఇటువంటి ప్రమాదం పొంచి ఉందని కేసీఆర్ ముందే పసిగట్టడం వలననే బిఆర్ఎస్ పార్టీని బీజేపిలో విలీనం చేసి ఈ కేసుల నుంచి విముక్తి పొందాలనుకున్నారా?అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఓ పక్క ఈ కేసుతో పాటు కాళేశ్వరం కేసు కూడా కొలిక్కి వస్తోంది. మరోపక్క ఎఫ్-1 రేసింగ్ కేసులో కేటీఆర్‌ని ఏసీబీ అధికారులు మళ్ళీ రేపు ప్రశ్నించబోతున్నారు.