విద్యార్ధులకు జాగృతి కండువాలు!

June 14, 2025


img

తండ్రి కేసీఆర్‌ నిరాదరణతో నిరాశ చెందిన కల్వకుంట్ల కవిత, తెలంగాణ జాగృతితో మళ్ళీ హడావుడి మొదలుపెట్టారు. 

ఈరోజు ఆమె కాలేజీ విద్యార్ధులకి జాగృతి కండువాలు కప్పి పార్టీలో చేర్చుకున్నారు. ఆమె బిఆర్ఎస్ పార్టీలో నేతలనో లేదా కాంగ్రెస్‌, బీజేపిలోని నేతలను, కార్యకర్తలనో ఆకర్షించి, జాగృతిలో చేర్చుకోగలిగితే రాజకీయంగా ఆమెకు బలం, పలుకుబడి ఉన్నాయని చాటి చెప్పినట్లు అయ్యేది. కానీ ముక్కు పచ్చలారని కాలేజీ పిల్లలకు పార్టీ అని కూడా చెప్పుకోలేని జాగృతి కండువాలు కప్పితే నవ్వులపాలవరా?

కల్వకుంట్ల కవిత మీడియాతో మాట్లాడుతూ, “బీసీలకు 42 శాతం రిజర్వేషన్స్ పెంచుతామని చెప్పి రేవంత్ రెడ్డి ప్రభుత్వం శాసనసభలో తీర్మానం చేసి ఢిల్లీకి పంపి చేతులు దులుపుకున్నారు. బీసీ రిజర్వేషన్స్ పెంచకుండానే స్థానిక సంస్థలు ఎన్నికలు జరుపుతామంటే చూస్తూ ఊరుకోబోము,” అని హెచ్చరించారు. 

రిజర్వేషన్స్ పెంపు రాష్ట్ర ప్రభుత్వం చేతిలో లేదనే సంగతి ఆమెతో సహా కేటీఆర్‌, హరీష్ రావు అందరికీ తెలుసు. అయినా ఆ తీర్మానానికి మద్దతు పలికి ఏకగ్రీవంగా ఆమోదం పొందేలా చేశారు. 

ఆ తర్వాత దాని గురించి ఎవరూ పట్టించుకోలేదు. పట్టించుకున్నా ప్రయోజనం ఉండదు. ఎందుకంటే డాని కోసం పార్లమెంటులో చట్ట సవరణ చేయాలి.. పార్లమెంటు దానిని ఆమోదించాలి. 

అది సాధ్యం కాదు కనుకనే నాడు కేసీఆర్‌ ‘ముస్లిం రిజర్వేషన్ పెంపు’ తీర్మానం కూడా రాజకీయ జిమ్మిక్కుగా మిగిలిపోయింది. కనుక మళ్ళీ తాను అదే జిమ్మిక్కు చేస్తే ప్రజలు నమ్ముతారా? అని ఆలోచిస్తే బాగుండేది. 

అయినా బిఆర్ఎస్ పార్టీ అండదండలు లేకపోతే తెలంగాణ జాగృతి మనుగడ సాగించలేని పరిస్థితి ఉన్నప్పుడు, జాగృతికి సొంతంగా బలమే లేననప్పుడు, స్థానిక సంస్థల ఎన్నికలని అడ్డుకుంటామని కల్వకుంట్ల కవిత హెచ్చరించడం చాలా హాస్యాస్పదంగా ఉందనిపిస్తుంది.. కదా?  

 


Related Post