బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై మరో కేసు నమోదు అయ్యింది. ఇటీవల సిఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ‘చిల్లరగాడు’ అంటూ చాలా అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు, కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ సైబర్ క్రైమ్ పోలీసులకు పిర్యాదు చేశారు.
కేటీఆర్ తరచూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిష్టకు భంగం కలిగించే విదంగా చాలా అనుచితంగా మాట్లాడుతున్నారని, సోషల్ మీడియాలో కూడా చాలా అనుచితమైన పోస్టులు పెడుతున్నారని బల్మూరి వెంకట్ పిర్యాదు చేశారు. ఆయన పిర్యాదు మేరకు పోలీసులు కేటీఆర్‌పై కేసు నమోదు చేశారు.
కాళేశ్వరం కేసులో తన తండ్రి కేసీఆర్‌కి జస్టిస్ పీసీ ఘోష్ కమీషన్ నోటీస్ ఇచ్చి విచారణకు పిలిపించడాన్ని తప్పు పడుతూ కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి చాలా అనుచిత వ్యాఖ్యలు చేశారు.
తన తండ్రిని విచారణకు పిలవడమే నేరమన్నట్లు మాట్లాడిన కేటీఆర్, ముఖ్యమంత్రిని ఉద్దేశించి ఆ విదంగా మాట్లాడటం తప్పుగా భావించలేదు.
కాళేశ్వరంతో సహా తాము దేనిలో ఎలాంటి అవినీతి, అక్రమాలకు పాల్పడలేదని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం తమని కుట్రపూరితంగా ఈ కేసులో ఇరికించాలని ప్రయత్నిస్తోందని కేటీఆర్, హరీష్ రావు తదితరులు వాదిస్తున్నారు.
వారు ఏ తప్పు చేయలేదని గట్టిగా నమ్ముతున్నప్పుడు ధైర్యంగా కేసులని ఎదుర్కొని తమ నిజాయితీ నిరూపించుకొని ప్రజల మెప్పు పొందవచ్చు.
కానీ విచారణకి పిలిచినందుకే ఎదురుదాడి చేస్తూ ప్రజలకు తప్పుడు సంకేతాలు పంపిస్తున్నారు. పైగా తీవ్ర అసహనంతో ముఖ్యమంత్రి, మంత్రులపై ఈవిదంగా అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ప్రజలలో తమ పట్ల వ్యతిరేకత పెరిగేలా చేసుకుంటూ ఈవిదంగా కొత్త కేసులలో చిక్కుకుంటున్నారు కూడా.