కల్వకుంట్ల కవితకి తండ్రి ఇంట్లో పరాభవం

June 12, 2025


img

బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకి నిన్న తండ్రి వద్ద పరాభవం ఎదురైంది. కేసీఆర్‌ నిన్న బిఆర్ఎస్ పార్టీ నేతలతో కలిసి జస్టిస్ పీసీ ఘోష్ కమీషన్‌ విచారణకు బయలుదేరుతుంటే, ఆయనని పరామర్శించేందుకు కల్వకుంట్ల కవిత తన భర్త అనిల్ కుమార్‌తో కలిసి ఫామ్‌హౌస్‌కి వచ్చారు. కానీ కేసీఆర్‌ ఆమెని పలకరించకుండానే పార్టీ నేతలతో కలిసి బీఆర్‌కే భవన్‌కు బయలుదేరి వెళ్ళిపోయారు. కారణం అందరికీ తెలిసిందే.

ఆమె అమెరికా నుంచి తిరిగి వచ్చిన తర్వాత ‘తండ్రి చుట్టూ కొన్ని దెయ్యాలు తిరుగుతున్నాయని, బిఆర్ఎస్ పార్టీని బీజేపిలో విలీనం చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారంటూ’ సంచలన వ్యాఖ్యలు చేశారు.

అప్పటి నుంచి ఆమె గులాబీ కండువా పక్కన పడేసి తెలంగాణ జాగృతి కండువాలు వేసుకొని అనుచరులను వెంటబెట్టుకొని చాలా హడావుడి చేస్తున్నారు.

ఇదే మరొకరు చేసి ఉండి ఉంటే ఈపాటికి పార్టీలో నుంచి బహిష్కరించి ఉండేవారే. కానీ కూతురు అనే ఏకైక కారణంతో ఆమెని కేసీఆర్‌ ఉపేక్షిస్తున్నారు.

ఆమె ఆరోపణలపై కేసీఆర్‌, బిఆర్ఎస్ పార్టీ స్పందించకుండా మౌనంగా ఉండిపోవడంతో పార్టీకి కాస్త నష్టం జరిగినప్పటికీ, పార్టీ శ్రేణులను ఆమెకు దూరంగా ఉంచడం ద్వారా ఆమె సొంతంగా లేదా ఒంటరిగా రాజకీయాలలో రాణించలేరని బాగా అర్దమయ్యేలా చేశారు.

బహుశః ఇప్పటికే ఈ విషయం ఆమెకు కూడా అర్దమయ్యి ఉంటుంది. అందుకే తండ్రిని పరామర్శించడానికి ఫామ్‌హౌస్‌కి వచ్చారు. కానీ తండ్రి పలకరించకుండా వెళ్ళిపోవడం ఆమెకు చాలా బాధ, పరాభవం మిగిల్చింది.

 కానీ ఆమె చేసిన ఆరోపణలు కేసీఆర్‌కి కూడా అంతే బాధ, పార్టీకి అప్రదిష్ట, నష్టం కలిగించాయి. కనుక ఆయన కూతురుపై ఆగ్రహంగా ఉండటం ఈవిదంగా వ్యవహరించడం సహజమే.

ఇంటికి వచ్చిన కూతురుని కేసీఆర్‌ పలకరించకపోవడంతో, అక్కడే ఉన్న బిఆర్ఎస్ నేతలు కూడా ఆమెను మొక్కుబడిగా పలకరించారు తప్పితే ఇది వరకులా గౌరవించలేదు.

 కేసీఆర్‌, బిఆర్ఎస్ పార్టీ నేతలు వెళ్ళిపోయిన తర్వాత ఆమె యశోధా హాస్పిటల్‌కు వెళ్ళి పల్లా రాజేశ్వర్ రెడ్డిని పరామర్శించి తిరిగి వెళ్ళిపోయారు.

తండ్రి వద్దకు తిరిగి రావడం ద్వారా రాజీకి సిద్దమని ఆమె సంకేతం ఇవ్వగా, ‘రాజీకి సిద్దంగా లేనని’ కేసీఆర్‌ సంకేతం ఇచ్చారు. కనుక కల్వకుంట్ల కవిత ఇప్పుడేమి చేయబోతున్నారో?


Related Post