బిఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్‌ ప్రభుత్వమే అస్త్రాలు అందిస్తోందా?

June 10, 2025


img

బిఆర్ఎస్ పార్టీ ప్రస్తుతం అనేక సమస్యలతో సతమతమవుతూ వాటి నుండి బయటపడేందుకు విశ్వప్రయత్నాలు చేస్తోంది. 

కనుక అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి , అధికారంలోకి రావాలనుకుంటున్న బీజేపికి మరింత బలపడేందుకు ఇదో చక్కటి అవకాశమే. కానీ రెండు పార్టీలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడంలో విఫలమవుతున్నట్లు కనపడుతోంది. 

ఇంకా గమ్మత్తైన విషయం ఏమిటంటే, కాంగ్రెస్‌ ప్రభుత్వమే ఆ పార్టీ మళ్ళీ పుంజుకునేందుకు అవకాశాలు కూడా అందిస్తోంది. 

మెట్రోచార్జీల పెంపు, ఆర్టీసీ బస్ పాసు ఛార్జీల పెంపుని నిరసిస్తూ బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు రోడ్లపైకి వచ్చి ఆందోళనలే ఇందుకు తాజా నిదర్శనంగా కనిపిస్తున్నాయి.

మెట్రో నిర్వహణ వ్యయం, బకాయిల నిమిత్తం ఛార్జీల పెంపు అనివార్యమనే విషయం కాంగ్రెస్‌ మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రజలకు వివరించడంలో అలసత్వం ప్రదర్శించగా, బిఆర్ఎస్ పార్టీ పెంపుని నిరసిస్తూ ఆందోళనలు చేస్తూ ప్రజల దృష్టిని ఆకర్షించగలుగుతోంది.   

అలాగే మహాలక్ష్మి పధకం వలన లక్షలాది మంది మహిళా ప్రయాణీకుల టికెట్ ఆదాయం కోల్పోయి టిజిఎస్ ఆర్టీసీ నష్టపోతుంటే, ఆ పధకం ద్వారా టిజిఎస్ ఆర్టీసీకి ఎంతో మేలు జరుగుతోందనే కాంగ్రెస్‌ మంత్రుల వితండవాదం కూడా కొంప ముంచుతోంది. 

ఈ పధకం వలన టిజిఎస్ ఆర్టీసీకి లబ్ధి కలుగుతున్నట్లయితే, నిరుపేద, మద్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్ధుల బస్సు పాసు ధరలు ఎందుకు పెంచారనే బిఆర్ఎస్ పార్టీ ప్రశ్నకు కాంగ్రెస్‌ మంత్రుల వద్ద సంతృప్తికరమైన సమాధానం లేదు. 

ఓ పక్క కల్వకుంట్ల కవిత తిరుగుబాటు వలన బిఆర్ఎస్ పార్టీలో లుకులుకలు బయటపడితే, సరిగ్గా ఇదే సమయానికి కాంగ్రెస్‌ పార్టీ మంత్రివర్గ విస్తరణ చేపట్టడం వలన, ఆ పార్టీలో కూడా లుకలుకలు బయటపడుతున్నాయి కదా?

బిఆర్ఎస్ పార్టీ కల్పిస్తున్న అవకాశాలు అందిపుచ్చుకోకపోగా తిరిగి దానికే ఈవిదంగా అవకాశాలు అందిస్తుండటం యాదృచ్ఛికమా? వ్యూహాత్మకమా?


Related Post