ఆపరేషన్ సింధూర్ తదనంతర పరిణామాలలో మజ్లీస్ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కూడా అన్ని పార్టీలతో పాటు కేంద్ర ప్రభుత్వానికి మద్దతు తెలిపారు. భారత్ తరపున విదేశాలలో పర్యటించి పాక్ ఉగ్రవాదాన్ని తీవ్రంగా ఖండించారు.
అయితే అన్ని పార్టీల మాదిరిగానే మజ్లీస్ కూడా ఈ పరిణామాలను తమకు అనుకూలంగా మలుచుకొని ప్రజలను ఆకట్టుకోవాలని ప్రయత్నించింది. హైదరాబాద్‌లో పలు ప్రాంతాలలో మెట్రో పిల్లర్లపై అసదుద్దీన్ ఓవైసీ ఫోటోలతో ఫ్లెక్సీ బ్యానర్లు వెలిశాయి. భారత్ తరపున అంతర్జాతీయ స్థాయిలో పాక్‌కి వ్యతిరేకంగా గట్టిగా తన గళం వినిపించిన ఓకే ఒక్కడు అసదుద్దీన్ ఓవైసీ.. అంటూ బ్యానర్లు వెలిశాయి.
ఎల్లప్పుడూ కేంద్రాన్ని, ప్రధాని మోడీని తీవ్రంగా వ్యతిరేకిస్తూ, కేవలం ముస్లింలకు సంబందించిన అంశాల గురించి మాత్రమే మాట్లాడే మజ్లీస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ దేశ భద్రత విషయంలో అచ్చమైన భారతీయుడులా వ్యవహరించడం, మాట్లాడటం అందరినీ.. ముఖ్యంగా దేశవ్యాప్తంగా ముస్లింలకు ఆకర్షించింది. తద్వారా అసదుద్దీన్ ఓవైసీ ఓ బలమైన నాయకుడనే గుర్తింపు పొందగలిగారు.
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు దగ్గర పడుతున్నందున ఆయనకు ఈ ప్రచారం చాలా ఉపయోగపడుతుంది. మజ్లీస్ ముస్లింల సమస్యల కొరకు మాత్రమే పోరాడుతుందనుకునే పాతబస్తీలో హిందూ ఓటర్లలో మజ్లీస్ పట్ల సానుకూలత పెరిగేందుకు ఇది దోహదపడుతుంది. ఈ అంశంపై అసదుద్దీన్ ఓవైసీ పోస్టర్లు పెట్టి మజ్లీస్ చాలా తెలివైన పనే చేసిందని చెప్పవచ్చు.