బంజారాహిల్స్‌లో తెలంగాణ జాగృతి కార్యాలయం

May 31, 2025


img

బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అడుగుతున్న ప్రశ్నలకు, చేస్తున్న విమర్శలు, ఆరోపణలకు కేసీఆర్‌ నుంచి సమాధానం రాకపోవడంతో పార్టీలో తన పరిస్థితి ఏమిటో తెలియని స్థితిలో ఉన్నారు. కనుక తెలంగాణ జాగృతిని యాక్టివ్‌ చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు.

శనివారం సాయంత్రం ఆమె బంజారాహిల్స్‌లో తెలంగాణ జాగృతి నూతన కార్యాలయం ఏర్పాటు చేసుకున్నారు. ఇక నుంచి ఇక్కడి నుంచే అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తానని చెప్పారు. కార్యాలయంలో బీఆర్ అంబేడ్కర్, ఆచార్య జయశంకర్, తెలంగాణ తల్లి, జ్యోతీబా ఫూలే, సావిత్రీ బాయి ఫూలే విగ్రహాలు, అమరవీరుల స్తూపం ఏర్పాటు చేసుకున్నారు. 

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, “కేసీఆర్‌ ఆచార్య జయశంకర్ స్పూర్తితో తెలంగాణ జాగృతి 18 ఏళ్ళ క్రితం ఏర్పడింది. తెలంగాణ ఉద్యమాలలో తెలంగాణ జాగృతి పాత్రని ఎవరూ కాదనలేరు. కేసీఆర్‌కి బిఆర్ఎస్, తెలంగాణ జాగృతి రెండు కళ్ళువంటివి. 

తెలంగాణ సాధించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన కేసీఆర్‌కు కాంగ్రెస్‌ ప్రభుత్వం నోటీస్ ఇవ్వడం అంటే తెలంగాణ ప్రజలందరికీ నోటీసులు ఇచ్చినట్లే. కనుక ఇందుకు నిరసనగా జూన్ 4న ఇందిరా పార్క్ వద్ద తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ధర్నా చేయబోతున్నాము. ఆ ధర్నాలో ఈ నోటీసుల కుట్ర అంతా వివరిస్తాము. అది కాళేశ్వరం కమీషన్ కాదు. కాంగ్రెస్‌ కమీషన్. కేసీఆర్‌ మీద ఈగ వాలినా ఊరుకోము. 

సిఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో పధకాలకు, అభివృద్ధి పనులకు ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీల పేర్లు పెడుతూ      తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని వారి కుటుంబానికి తాకట్టు పెట్టేశారు. కనీసం జై తెలంగాణ అనడానికి కూడా రేవంత్ రెడ్డి ఇష్టపడటం లేదు. కనీసం రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజైనా రేవంత్ రెడ్డి అమరవీరుల కు నివాళులు అర్పించి, ‘జై తెలంగాణ’ అని అనాలి,” అని కల్వకుంట్ల కవిత అన్నారు. 


Related Post