ప్రముఖ నటుడు, నిర్మాత, దర్శకుడు ఆర్ నారాయణ మూర్తి ‘థియేటర్స్ బంద్’ అంశంపై రాజకీయాలను ఖండించారు. ఈరోజు ఆయన మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతూ, “సినీ పరిశ్రమకి, సినీ ప్రియులకు దేవాలయాల వంటివి సింగిల్ స్క్రీన్ థియేటర్స్.
రెండు తెలుగు రాష్ట్రాలలో కొన్ని వందల సంఖ్యలో సింగిల్ స్క్రీన్ థియేటర్స్ మూతపడుతున్నాయి. థియేటర్లు నడిపించలేక వాటి యజమానులు గోదాములుగా, కళ్యాణ మండపాలుగా మార్చేసి అద్దెలకు ఇచ్చుకుంటున్నారు. వాటిని చూసి సినీ ప్రియులు ఎంతగా బాధపడుతున్నారో ఎవరికీ తెలియదు.
కనుక పర్సంటేజ్ విధానం అమలు చేయాలని కోరుతూ థియేటర్స్ యజమానులు బంద్ పిలుపునిస్తే, దానిని హరిహర వీరమల్లు సినిమాతో ముడిపెట్టి రాజకీయాలు చేయడం చాలా తప్పు. అసలు సమస్య పర్సంటేజ్ విధానం గురించి మాట్లాడకుండా దానిని పక్కన తోసేసి హరిహర వీరమల్లు గురించి ఎందుకు మాట్లాడుతున్నారు?
పర్సంటేజ్ విధానం అమలు చేయాలని కోరుతూ నేను స్వయంగా ఫిలిం ఛాంబర్ ఎదుట ధర్నాలు చేసిన రోజులున్నాయి. కానీ నేటికీ ఈ సమస్య పరిష్కారం కాకపోవడం వల్లనే సింగిల్ స్క్రీన్ థియేటర్స్ బంద్ అవుతున్నాయి.
ఇప్పుడు థియేటర్స్ యజమానులు పద్దతి ప్రకారం మూడు వారాలు ముందుగా నిర్మాతల మండలికి నోటీస్ ద్వారా తెలియజేసి, తమ సమస్యలు పరిష్కరించాలని లేకుంటే జూన్ 1 నుంచి బంద్ చేస్తామని చెపితే, దానిపై ఏపీ ప్రభుత్వం స్పందించిన తీరు సరికాదు.
సినీ ప్రముఖులు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని మర్యాదపూర్వకంగా కలవాలనే పవన్ కళ్యాణ్ కోరడం తప్పుకాదు. కానీ ఏపీ ప్రభుత్వం కూడా మర్యాదపూర్వకంగా ఆహ్వానించి ఉండి ఉంటే బాగుండేది కదా? పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు గురించి మాట్లాడకుండా, ఈ సమస్యపై చర్చలకు ఆహ్వానించి ఉండి ఉంటే ఎంతో హుందాగా ఉండేది కదా?
కనీసం ఇప్పటికైనా ఏపీ ప్రభుత్వం, ముఖ్యంగా సినీ పరిశ్రమకు చెందిన పవన్ కళ్యాణ్ సింగిల్ స్క్రీన్ థియేటర్స్ యాజమానుల కోణంలో నుంచి ఆలోచించి, చొరవ తీసుకొని సమావేశం ఏర్పాటు చేసి ఈ సమస్యని పరిష్కారిస్తే బాగుంటుంది,” అని నారాయణ మూర్తి అన్నారు.