ఆమె కండువాలు వదిలేస్తే.. ఆమెను గులాబీ నేతలు వదిలేశారు!

May 30, 2025


img

ఈరోజు పెద్దపల్లి జిల్లా రామగుండంలో కల్వకుంట్ల కవిత పర్యటించినప్పుడు ఆమె మెడలో గులాబీ కండువా కనిపించలేదు. ఆమెకు స్వాగతం పలుకుతూ అక్కడ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ బ్యానర్లలో కేసీఆర్‌ ఫోటో తప్ప కేటీఆర్‌, హరీష్ రావు ఫోటోలు పెట్టలేదు.

ఆమెతో సహా అందరూ జై తెలంగాణ అంటూ నినాదాలు చేశారే తప్ప ఎవరూ కేసీఆర్‌, బిఆర్ఎస్ పార్టీ ప్రస్తావన చేయలేదు. ఇంతకాలం ఆమె జిల్లా పర్యటనకు వస్తున్నారంటే గులాబీ నేతలు చాలా హడావుడి చేసేవారు. కానీ ఇవాళ్ళ ఆమె రామగుండం వచ్చినప్పుడు ఒక్క సీనియర్ నేత, కనీసం మాజీ ఎమ్మెల్యేలు గానీ చుట్టూపక్కల కనపడలేదు. 

అంటే ఆమె వర్గం బిఆర్ఎస్ పార్టీకి దూరమవుతుంటే, పార్టీ వర్గాలు కూడా ఆమెకు దూరం అవుతున్నాయని స్పష్టం అవుతోంది. పార్టీ వీడటం లేదు. కొత్త పార్టీ పెట్టడం లేదంటూనే ఆమె బిఆర్ఎస్ పార్టీకి దూరం జరుగుతూ, జిల్లా పర్యటనలు మొదలుపెట్టి సొంత బలం పెంచుకునే ప్రయత్నాలు చేస్తుండటం విశేషం. 

ఆమె ఇప్పటికే కేసీఆర్‌ని, కేటీఆర్‌, హరీష్ రావులను, పార్టీ విధానాలను విమర్శిస్తూ పార్టీ గీత దాటేశారు. మరోపక్క ఆమె కూడా కేసీఆర్‌ మౌనం పట్ల తీవ్ర అసహనంతో ఉన్నారని ఆమె మాటలతో అర్దమవుతోంది. కనుక త్వరలోనే బిఆర్ఎస్ పార్టీలో ఆమె కధ ముగిసిపోవచ్చు. అది ఎప్పుడు, ఏవిదంగా అనేది మాత్రమే తెలియాల్సి ఉంది.


Related Post