కేసీఆర్ కుమార్తె లేఖాస్త్రంతో తండ్రి కేసీఆర్‌పై యుద్ధం ప్రకటించారు. కానీ ఇంత వరకు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఎవరూ స్పందించకపోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఈ రోజు పెద్దపల్లి జిల్లా రామగుండంలో పర్యటించినప్పుడు ఆమె మాట్లాడిన మాటలు వింటే వారి మౌనం బహుశః ఆమెకు తీవ్ర అసహనం కలిగిస్తోందనిపిస్తుంది.
“నేను బిఆర్ఎస్ పార్టీని బీజేపిలో విలీనం కాకుండా కాపాడుకోవాలని ఆరాటపడుతున్నాను. కానీ నేనే దోషినన్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఆ దుష్ప్రచారం వెనుక ఎవరున్నారో నాకు బాగా తెలుసు. పార్టీలో ఉంటూనే కొందరు విలీనం కుట్రలు చేస్తున్నారు. ఈ విషయం నా లేఖలో ప్రస్తావించినందునే ఆ లేఖని బయటకు లీక్ చేసి నా తండ్రిని నేను కలవలేని పరిస్థితి కల్పించారు.
ఒకవేళ బీజేపిలో బిఆర్ఎస్ పార్టీ విలీనం అయ్యేందుకు సిద్దపడితే, లిక్కర్ స్కామ్ కేసులో నేను అవినీతికి పాల్పడ్డానని అంగీకరించినట్లే అవుతుంది కదా? ఆ కేసుకి భయపడే విలీనం కోసం సిద్దపడ్డామని ప్రజలు అనుకోకుండా ఉంటారా? కనుక ఈ విలీనం ఆలోచన విరమించుకోవాలని కేసీఆర్‌కి విజ్ఞప్తి చేస్తున్నాను,” అని కల్వకుంట్ల కవిత అన్నారు.
బీజేపిలో విలీనం కాకుండా పార్టీని కాపాడుకునే శ్రేయోభిలాషిలా ఓ పక్క మాట్లాడుతూనే మరోపక్క విలీనం విలీనం అంటూ తండ్రి కేసీఆర్ విశ్వసనీయతని కూడా దెబ్బ తీస్తున్నారు కదా? కనుక ఆమె తండ్రి శ్రేయోభిలాషా.. లేదా ఆయన పక్కలో బల్లెమా?