భారత్‌ దాడులు పసిగట్టలేకపోయాము: పాక్‌ ప్రధాని

May 30, 2025


img

భారత్‌-పాక్‌ మద్య చిన్నపాటి యుద్ధం ముగిసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం వివిద పార్టీలకు చెందిన ఎంపీలను వివిద దేశాలకు పంపించి పాక్‌ ఉగ్రవాదం.. దానికి అడ్డుకట్ట వేసేందుకు భారత్‌ చేపట్టిన ఆపరేషన్ సింధూర్‌ గురించి వివరిస్తుంటే, పాక్‌ ప్రధాని షాహబాజ్ షరీఫ్ తమ మిత్రదేశాలైన తుర్కీయే, అజర్ బైజాన్‌ల వద్దకు వెళ్ళి తమ గోడు మొర పెట్టుకున్నారు. 

ఇటీవల అజర్ బైజాన్‌లో జరిగిన మూడు దేశాల సదస్సులో పాల్గొన్న పాక్‌ ప్రధాని షాహబాజ్ షరీఫ్ మే 10న జరిగిన దాడుల గురించి చెప్పుకొని వాపోయారు. 

ఆపరేషన్ సింధూర్‌తో భారత్‌ తమ దేశంపై దాడి చేసినందున దానికి ప్రతిగా మే 10 వ తేదీ తెల్లవారుజామున 4.30గంటలకు భారత్‌ మీద దాడులు చేయాలని మే 9 వ తేదీ రాత్రి అనుకున్నామని, కానీ తెల్లారేలోగానే భారత్‌ బ్రహ్మోస్ క్షిపణులతో రావల్పిండి విమానాశ్రయంతో సహా పలు సైనిక, వాయుసేన స్థావరాలపై భీకర దాడులు చేసి ధ్వంసం చేసిందని చెప్పారు.

భారత్‌ చేసిన దాడులతో తాము ఎదురు దాడులు చేయలేని దుస్థితి కలిగిందని, తీవ్రంగా నష్టపోయామని పాక్‌ ప్రధాని షాహబాజ్ షరీఫ్ మిత్ర దేశాలకు చెప్పుకొని బాధపడ్డారు. 

కశ్మీర్‌ సమస్యని చర్చల ద్వారా పరిష్కరించుకుందామని తాము భారత్‌ని కోరుతున్నా పట్టించుకోవడం లేదన్నారు.  తాము భారత్‌తో ఎప్పుడూ స్నేహాసంబంధాలే కోరుకుంటున్నామని, కానీ భారత్‌ దుందుడుకుగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. తక్షణం శాంతి చర్చలు మొదలుపెట్టి మళ్ళీ ఇరుదేశాల మద్య వాణిజ్య సంబంధాలు పునరుద్దరించాలని పాక్‌ ప్రధాని షాహబాజ్ షరీఫ్ అన్నారు. 

దీనిపై భారత్‌ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పందిస్తూ, “పాక్‌ ఆ ముగ్గురు ఉగ్రవాదులను, తన అధీనంలో ఉన్న కశ్మీర్‌ని అప్పగించే వరకు ఆ దేశంతో శాంతి చర్చల ప్రసక్తే లేదు. ఉగ్రవాదం, వాణిజ్యం ఒకే చోట సాధ్యం కావని పాక్‌ గ్రహించాలి,” అని అన్నారు.     



Related Post