తెలంగాణ స్పెషల్ ఇంటలిజన్స్ బ్రాంచ్ (ఎస్‌ఐబీ) మాజీ ఓఎస్‌డీ (ఆఫీసర్ ఆన్ డ్యూటీ) ప్రభాకర్ రావుకి సుప్రీంకోర్టులో కాస్త ఊరట లభించింది. కానీ సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఆయనకు చాలా ఇబ్బందికరంగా మారనున్నాయి.
ముందస్తు బెయిల్ ఇస్తేనే అమెరికా నుంచి హైదరాబాద్ తిరిగి వస్తానని ఆయన సుప్రీంకోర్టుకి షరతు విధించలేరని స్పష్టం చేసింది. ఆయన బెయిల్ పిటిషన్‌పై తర్వాత విచారణ చేపడతామని ముందు హైదరాబాద్ తిరిగి రావాలని ఆదేశించింది. ఈ నెలాఖరులోగా హైదరాబాద్ తిరిగి వచ్చి, ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరుకావాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
అయితే తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు ఆయనపై ఎటువంటి చర్యలు చేపట్టవద్దని సుప్రీంకోర్టు తెలంగాణ పోలీసులని ఆదేశించింది. కనుక ఇది ఆయనకు ఆఖరి అవకాశమని చెప్పవచ్చు. ఆయన హైదరాబాద్ తిరిగి వచ్చినా పోలీసులు అరెస్ట్ చేయరు కనుక వచ్చి విచారణకు హాజరైతే మంచిదే.
కానీ ఒకవేళ ముందస్తు బెయిల్ మంజూరు కాకపోతే అప్పుడు అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. కనుక ఆ భయంతో హైదరాబాద్ తిరిగి రాకుండా అమెరికాలోనే ఉండిపోయినా ఆశ్చర్యం లేదు. అప్పుడు ఇంటర్ పోల్ సాయంతో అమెరికాలోనే అరెస్ట్ చేసి హైదరాబాద్ తీసుకురావాల్సి వస్తే ఆయనకు ఇంకా ఇబ్బందికరంగా మారుతుంది.
మరి ఆయన హైదరాబాద్ తిరిగివస్తారో లేదో మూడు రోజులలోనే తేలిపోతుంది. వచ్చి నోరు విప్పితే ఇప్పటికే కాళేశ్వరం కేసు, కూతురు కవిత ఆరోపణలతో ఇబ్బంది పడుతున్న కేసీఆర్, మరిన్ని సమస్యలలో కూరుకుపోవడం ఖాయం.