కల్వకుంట్ల కవిత: ఇక తాడో పేడో?

May 29, 2025


img

బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈరోజు మరోసారి పార్టీలో కోవర్టులున్నారంటూ తీవ్రంగా విరుచుకుపడ్డారు. కనుక ఇది ఫైనల్ కౌంట్ డౌన్‌ వంటిదే అని భావించవచ్చు. ఈ దెబ్బతో ఆమెను కేసీఆర్‌ బిఆర్ఎస్ పార్టీలో ఉంచుకుంటారో లేదో తేల్చి చెప్పక తప్పదు. 

కల్వకుంట్ల కవిత ఏమన్నారో క్లుప్తంగా.. 

• కేసీఆర్‌కు నోటీసులు ఇస్తే ఒక్కరూ కూడా స్పందించలేదు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి చేతులు దులుపుకున్నారు. అధినేత పట్ల ఇలాగేనా వ్యవహరించేది?

• నా తండ్రికి నేను వ్రాసిన లేఖని మీడియాకు ఎవరు లీక్ చేశారో చెప్పమంటే ఇంతవరకు సమాధానం చెప్పకుండా నాకు నీతులు చెపుతున్నారు. నామీద పడి ఎదుస్తున్నారు. 

• నేను నా తండ్రికి వందల కొద్దీ లేఖలు వ్రాశాను. ఆయన వాటిని చదివిన తర్వాత చించేసే వారు. కానీ చివరిగా వ్రాసిన లేఖ మాత్రం మీడియాకు లీక్ అయ్యింది. ఈ పని ఎవరు చేశారని అడిగితే సమాధానం లేదు.   

• నాడు లిక్కర్ కేసులో రాజీనామా చేస్తానంటే కేసీఆర్‌ వద్దన్నారు. 

• నేను జైల్లో ఉన్నప్పుడు బిఆర్ఎస్ పార్టీని బీజేపిలో విలీనం చేసేయాలనే ప్రతిపాదనలు వస్తే నేను వాటిని తీవ్రంగా వ్యతిరేకించాను. తెలంగాణ అస్తిత్వం కోసం ఏర్పడిన బిఆర్ఎస్ పార్టీ ఎప్పటికీ స్వతంత్రంగా నిలిచి ఉండాలని గట్టిగా చెప్పాను.     

• నాడు నిజామాబాద్‌ నుంచి ఎంపీగా పోటీ చేస్తే పార్టీలోవారే నన్ను ఓడించారు. ఇదే విషయం నేను నా తండ్రికి తెలియజేస్తే స్పందించలేదు. 

• లోక్‌సభ ఎన్నికలలో పార్టీ ఓటమికి కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని నేను కోరితే స్పందించలేదు.  

• నేను కొత్త పార్టీ పెట్టడం లేదు. కాంగ్రెస్ పార్టీలో చేరడం లేదు. అవన్నీ పుకార్లే. 

• పార్టీలో ఇతర నేతలపై ఈగ వాలనీయకుండా కాపాడుకుంటారు.  కానీ నాపై మీడియాలో ఇంత దుష్ప్రచారం జరుగుతున్నా పార్టీ స్పందించడం లేదు. ఎందువల్ల? పైగా నన్నే దోషిగా చూపేందుకు పార్టీలో కొందరు కుట్రలు చేస్తున్నారు.

• దామోదర్ రావు, గండ్ర మోహన్ రావు ఎవరి మనుషులో.. వారిని నా వద్దకు ఎవరు పంపారో అందరికీ తెలుసు. 

• నేను కేసీఆర్‌కి వెన్నుపోటు పొడవను. ఆయన అనుమతించినంత కాలం వెన్నంటి నడుస్తాను.  

• నన్ను పార్టీకి, కుటుంబానికి దూరం చేసేందుకు కుట్రలు జరుగుతున్నాయి. దాని వలన ఎవరు లాభపడతారో పార్టీ అధిష్టానమే ఆలోచించుకోవాలి. 

• రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ బలహీన పడితే కాంగ్రెస్‌, బీజేపిలు లబ్ధి పొందుతాయని అందరికీ తెలుసు.

• నేను వేరేవరి నాయకత్వంలో పనిచేసే ప్రసక్తే లేదు. కేవలం కేసీఆర్‌ నాయకత్వంలోనే పనిచేస్తాను.


Related Post