కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ కమీషన్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రులు హరీష్ రావు, ఈటల రాజేందర్‌లను విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు పంపిన సంగతి తెలిసిందే.
జూన్ 5న కేసీఆర్, 6న ఈటల రాజేందర్, 9న హరీష్ రావు హాజరు కావలసి ఉంది. వారిలో ఈటల రాజేందర్ తాను తప్పకుండా విచారణకు హాజరవుతానని చెప్పారు. తాజాగా కేసీఆర్, హరీష్ రావులు కూడా విచారణకు హాజరవ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
ఇటీవలే వారిరువురూ ఫామ్‌హౌస్‌లో భేటీ న్యాయనిపుణులు, పార్టీలో సీనియర్లతో ఈ అంశంపై చర్చించారు. అందరి సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
కేసీఆర్ విచారణకు హాజరైతే, ఇది రాజకీయంగా చాలా మంచి నిర్ణయమని చెప్పవచ్చు.
కల్వకుంట్ల కవిత లేఖ, విమర్శల కారణంగా బిఆర్ఎస్ పార్టీలో అంతర్గత విభేధాలు బయటపడగా, ఆమె పార్టీకి రాజీనామా చేసి కొత్త పార్టీ పెట్టుకోబోతున్నారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
కనుక కాంగ్రెస్, బీజేపి, తెలంగాణ ప్రజలతో సహా ఇరుగు పొరుగు రాష్ట్రాల దృష్టి బిఆర్ఎస్ పార్టీపైనే ఉంది. ఈ నేపధ్యంలో కేసీఆర్ విచారణకు హాజరైతే, బిఆర్ఎస్ పార్టీ దీనికి హైప్ సృష్టించి చాలా హడావుడి చేస్తుంది. అప్పుడు అందరి దృష్టి ఈ అంశంపైకి మళ్ళుతుంది కనుక బిఆర్ఎస్ పార్టీకి కాస్త ఉపశమనం లభిస్తుంది.
“కాళేశ్వరం ప్రాజెక్టులో ఏ తప్పు జరుగకపోతే, ఏ అవినీతి జరుగకపోతే కేసీఆర్, హరీష్ రావులు విచారణకు హాజరయ్యి తమ నిబద్దత, నిజాయితీ నిరూపించుకోవచ్చు కదా?” అని కాంగ్రెస్ మంత్రులు సవాళ్ళు విసురుతున్నారు.
కనుక కేసీఆర్, హరీష్ రావులు విచారణకు హాజరవడం ద్వారా వారికీ జవాబు చెప్పడంతో పాటు ప్రజలకు తమ పట్ల సదాభిప్రాయం కలిగించగలుగుతారు. కనుక విచారణకు హాజరు కావడం అన్ని విదాలా మంచి నిర్ణయమే అని చెప్పవచ్చు.