ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో సింగిల్ స్క్రీన్ థియేటర్ల యజమానులు జూన్ 1 నుంచి బంద్ ప్రకటించడంపై రాజకీయాలు మొదలయ్యాయి. సినిమాల ప్రదర్శనకు అద్దె రూపంలో ఇస్తున్న మొత్తం సరిపోవడం లేదని, కలెక్షన్స్‌లో నిర్దిష్టమైన పర్సంటేజ్ ఇవ్వాలని కోరుతూ వారు నిర్మాతల మండలికి నోటీస్ ఇచ్చారు.
ఇది నిర్మాతలకు, థియేటర్స్ యజమానులకు సంబందించిన సమస్య. కనుక చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి. కానీ నిర్మాతల మండలి వారి ప్రతిపాదనని వ్యతిరేకించడమే కాకుండా బంద్ ఆలోచన మానుకోవాలని ఒత్తిడి చేయడం మొదలుపెట్టింది.
గతంలో నిర్మాతల మండలి సినీ వర్కర్స్ యూనియన్లతో ఏర్పడిన సమస్యలు పరిష్కారం కోసం అంటూ ఏకపక్షంగా నెలరోజులు సినిమా షూటింగులు నిలిపివేసినప్పుడు, నష్టాలు, కష్టాల గురించి పట్టించుకోలేదు.
కానీ ఇప్పుడు థియేటర్స్ యజమానులు తమ ఆర్ధిక ఇబ్బందులు చెప్పుకొని వాటిని అధిగమించేందుకు బంద్ అంటే వారిపై అందరూ నిప్పులు చెరుగుతున్నారు.
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమాకు ఆయన సమయం కేటాయించకపోవడం వలన దాదాపు నాలుగేళ్ళు పూర్తికాకపోయినా ఎవరూ తప్పు పట్టలేదు.
కానీ ఆ సినిమా జూన్ 12న విడుదల కాబోతుంటే థియేటర్స్ యజమానులు జూన్ 1 నుంచి బంద్ ప్రకటించడంపై ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ కూడా భగ్గుమంటున్నారు. ఆయన కూడా జనసేన పార్టీకి చెందినవారు కావడమే ఇందుకు కారణంగా కనిపిస్తోంది.
హరిహర వీరమల్లు సినిమా విడుదలవుతుంటే, జూన్ 1 నుంచి థియేటర్స్ బంద్ చేయాలనే ఎవరు నిర్ణయం తీసుకున్నారు?దీని వెనుక ఏదైనా రాజకీయ కుట్ర ఉందా?ఈ నిర్ణయం వలన ఇంకా ఎన్ని సినిమాలు నష్టపోతాయి? రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఆదాయం నష్టపోతుంది? విచారణ జరిపి తెలుసుకోవాలని ఏపీ రాష్ట్ర హోం శాఖ కార్యదర్శిని ఆదేశించారు.
ఒకవేళ ఇది పవన్ కళ్యాణ్ సినిమా కాకపోయినా లేదా ఒకవేళ హరిహర వీరమల్లు మరోసారి వాయిదా పడినా టే ఏపీ ప్రభుత్వం ఇదే విదంగా స్పందించి ఉండేదా?అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.